అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

– ఎవరూ హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లొద్దు
– ఆగస్టు మొదటి వారంలో పచ్చదనం స్పెషల్‌ డ్రైవ్‌
– పీఆర్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, జూలై 25: గ్రామాల్లో పచ్చదనం-స్వచ్ఛదనం పెంచేలా ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో గ్రామీణ రహదారులు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున సత్వరమే పునురుద్దరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్య పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం హెడ్‌ ఆఫీస్‌లో డీఈ, ఎస్‌ఈలతో మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి పీఆర్‌, ఆర్డీ శాఖలపై మంత్రి సీతక్క జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్ధితులపై ఆరా తీశారు. మిషన్‌ భగీరథ పైప్‌ లైన్లను నిత్యం పరిశీలించాలని, వర్షాలు, వరదలతో పైప్‌లు లీక్‌ అయితే తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వర్షాకాలం పూర్తయ్యేవరకు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని అన్నారు. గ్రామీణ తాగునీటి పథకం, పారిశుధ్యం, గ్రామీణ రోడ్లు, మొక్కల పెంపకంపై సమీక్షించి పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వనమహెత్సవంలో భాగంగా 2.44 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు నివేదించగా వేగం పెంచాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్‌, తాగునీటి సరఫరా, గ్రామీణ రహదారుల పరిస్థితిపై రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి ఎన్‌.శ్రీధర్‌, డైరెక్టర్‌ జి.సృజన, ఈఎన్సీలు కృపాకర్‌ రెడ్డి, ఎన్‌.అశోక్‌, ఇతర ఉన్నతాధికులు పాల్గొని తమ విభాగాల పరిధిలో చేపట్టిన చర్యలను నివేదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *