– మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సీ భవనంలో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రజ్వల ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సునీత కృష్ణన్‌కు అభినందనలు తెలిపారు. 32 వేల మంది యువతులు, మహిళలకు వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారని తెలిపారు. ఆమె స్ఫూర్తితో బాలికల, యువతుల, మహిళల కోసం పనిచేస్తున్న ఆరుగురు ప్రముఖులను ఈరోజు సన్మానించినట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి మానవ అక్రమ రవాణా ముఠాపై పోరాటం చేస్తున్న ప్రజ్వల ఫౌండేషన్ అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క అన్నారు. ఇంట్లో మహిళలను పెట్టుకుని ఇతర మహిళల శరీరాలపై వ్యాపారాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళల్లో పేదరికం నిర్మూలనకు ‘సెర్ప్’ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, మహిళా స్వయం సహాయక సంఘం అంటే కేవలం ఆర్థిక స్వావలంబనే కాదు.. అది మహిళల్లో సామాజిక భద్రతను, మానసిక ధైర్యాన్ని కలిగిస్తోందని వివరించారు. సమష్టి పోరాటం ద్వారా మానవ అక్రమ రవాణా భూతాన్ని అంతం చేయవచ్చునన్నారు. అన్ని విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మహిళలపై నేరాలను అరికట్టవచ్చునని మంత్రి సీతక్క తెలిపారు. స్టేట్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ‘సెర్ప్’ సీఈవో దివ్య దేవరాజన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.





