– గాలి స్వచ్ఛంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు
– ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దుదాం
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నేటి బాలలే రేపటి భావిభారత పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని ఎకో పార్కులో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్‌కుమార్, టీజీఎస్‌పీ 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రమణ్యం, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణిలతో కలిసి వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 25 వేల మొక్కలు నాటాలని లక్ష్యంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని, పర్యాటక ప్రాంతంతోపాటు దట్టమైన అడవులు ఉండటం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. ఎకో ప్రాంతంలో వాచ్ టవర్, వాక్ ఫాల్స్ ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయమని, అడవులను రక్షిస్తూనే పచ్చదనాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి ద్వారా ప్రజల ఆయుష్షు పెరుగుతుందని అన్నారు. జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ తమ చిన్నతనంలో వన మహోత్సవం గురించి పుస్తకాలలో చదువుకున్నామని, కానీ నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వనమోత్సవం కార్యక్రమంలో భాగస్వాములవడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అన్ని వసతులతో కూడిన అద్భుతమైన పార్కు ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు కృషి చేశారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే సామాజిక విలువలు, అడవుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఏపిడి వెంకటనారాయణ, ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌డివీలు, రేంజర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.



