పగిడిద్ద రాజు ఆలయంలో మంత్రి సీతక్క పూజలు

– వచ్చే జాతరకు యునెస్కో గుర్తింపు రావాలి

మహబూబాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల పగిడిద్ద రాజు ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న సందర్భంగా మంగళవారం పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి మేడారం బయలుదేరుతున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెలకు చేరే సమయానికి పగిడిద్దరాజు కొలువుదీరనున్నారు.
ఆదివాసీ సంప్రదాయాల పద్ధతిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య మహిళలతో నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇర్ప సుకన్య, స్టేట్ డైరెక్టర్ చల్ల నారాయణ రెడ్డి, కొత్తగూడెం గంగారం మండలాల అధ్యక్షులు వజ్జే సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, పలు గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, భక్తకోటికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ మహాజాతర ప్రతి భక్తుడి హృదయంలో భక్తి భావాన్ని నింపాలని, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి శాంతి, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. సమ్మక్క సారలమ్మ తల్లులు ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు సమృద్ధిగా ప్రసాదించాలని ప్రార్థించారు. నిండు పున్నమి వెలుగుల్లో సమ్మక్క, సారలమ్మలను భక్తులు ప్రశాంతంగా దర్శించుకుని సురక్షితంగా తిరిగి వెళ్లాలని ఆమె కోరారు. అమ్మల దయతో వచ్చే జాతర వరకు యూనిస్కో గుర్తింపు రావాలన్నారు.

జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి 

మహాజాతర సందర్భంగా మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. గద్దెల ప్రాంగణం పక్కనే ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో దీనిని ఏర్పాటు చేశారు. జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలకు సకాలంలో చేరేలా అన్ని సౌకర్యాలు మీడియా సెంటర్‌లో కల్పించినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అత్యంత తక్కువ సమయంలో జాతర ఏర్పాట్లు పూర్తవడానికి అమ్మవారి దయే కారణమని పేర్కొన్నారు. రేపటి నుంచి మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారని తెలిపారు. జాతర నిర్వహణ కోసం అధికారులు రాత్రింబవ·ళ్లు శ్రమించారని మంత్రి ప్రశంసించారు. ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు కనిపిస్తే భక్తులు క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సమాచార పౌర సంబంధర శాఖ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు, కె.వెంకటసురేష్, ఎ.డి. లక్ష్మణ్ కుమార్, వసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కాళ్యాణి, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *