– కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి సీతక్క ఆదేశాలు
– భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రి
ములుగు, ప్రజాతంత్ర, జులై 23: భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, మహబూబాబాద్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గత అనుభవాల నేపథ్యంలో మంత్రి స్వయంగా కార్యచరణలోకి దిగి ములుగు జిల్లా పరిధిలోని పస్రా-తాడ్వాయి మార్గంమధ్యలో ఉన్న జలగలంచ, గుండ్ల వాగులను ఆమె స్వయంగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా, ప్రత్యేకంగా ములుగు జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలను ముందుగా హెచ్చరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు ములుగు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ నంబరుకు కాల్ చేయాలని ప్రజలను ఆమె కోరారు. విద్యుత్ తీగలు పడిపోయిన చోట రైతులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ షాక్ ప్రమాదాలకు గురి కాకుండా తగిన జాగ్రతల్లు పాటించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెల్లోద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కింది స్థాయి అధికారులతో మానిటరింగ్ చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


