అంతా తానై వ్యవహరించిన సీతక్క

– మేడారం పనులపై సీఎంను ఒప్పించడంలో సఫలం
– అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి పట్టు
– పూజారులను ఒప్పించడంలోనూకీలక పాత్ర
– క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొదటి సీఎం రేవంత్‌

మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మేడారం అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌ అంశాలపై సచివాలయంలో వరుస సమీక్షలు, అన్ని శాఖల మధ్య సమన్వయం తీసుకురావడంలో ములుగు ఎమ్మెల్యే, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సఫలమయ్యారు. స్వయంగా సీఎంను మేడారం రప్పించడంలో సీతక్క సక్సెస్‌ అయ్యారు. మూడు రోజుల ముందునుంచే ఆమె మేడారంలో మకాం వేసి సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్పీ తదితర ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఏ లోటు రాకుండా చూసుకున్నారు. మేడారానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ రెడ్డి తొలిసారి వచ్చిన సందర్భంగా అక్కడ ఉత్సాహపూరిత, పండుగ వాతావరణం నెలకొంది. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు వేలాదిమంది భక్తులు, స్థానిక ప్రజలు నిరీక్షించారు. మేడారం అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొట్టమొదటి సీఎం కూడా రేవంత్‌రెడ్డే. ఆదివాసి గిరిజనుల ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రెండు గంటలకుపైగా అభివృద్ధి ప్రణాళికపై సీఎం సమీక్షించారు. సమీక్షలో పూజారుల అభిప్రాయాలు తెలుసుకుని మేడారం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క సారలమ్మ పూజారుల అభిప్రాయాలకు పెద్దపీట వేశారు. మేడారం మహా జాతరలోపు యజ్ఞంలా పనులు కొనసాగించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేయడమేగాక దగ్గరుండి పనులు పూర్తి చేసే బాధ్యతలను మంత్రులు పొంగులేటి, సీతక్కకు అప్పగించారు. అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలంతా భాగస్వామ్యం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సమ్మక్క- సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతోనే సీఎం అయ్యానని రేవంత్‌ రెడ్డి ప్రకటనతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రేవంత్‌ రెడ్డి పర్యటన మేడారం అభివృద్ధికి నాంది పలికిందని స్థానికులు పేర్కొనడం గమనార్హం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *