– రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: రాఖీ పండగ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ప్రేమకు, అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ మన కుటుంబ సంబంధాలకు మరింత బలాన్ని ప్రోది చేస్తుందన్నారు. మహిళల సాధికారతే సమాజ పురోగతికి పునాది అన్న దృక్పథంతో ప్రజా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలతో మహిళలకు మేలు చేకూరుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరిగే దిశగా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళల సంరక్షణకు, సంక్షేమానికి, ఆర్థిక స్వావలంబనకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలందరికీ పెద్దన్నగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ పండుగను పురస్కరించుకుని ప్రతి మహిళా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.



