– హస్తం గుర్తుకు ఓటు వేయాలి
– బోరబండ అన్నా నగర్‌లో మంత్రి సీతక్క ప్రచారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధికి, విస్తరణకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బలపరచాలని, చేయి గుర్తుకు ఓటేసి అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బోరబండ అన్నా నగర్‌లో ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఓటర్లనుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అవలంబిస్తున్నామని, యేటా రూ.25 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నామని, మహిళా సంఘాల తరఫున వారి వ్యాపారాలకు అవసరమైన నిధులను సమీకరిస్తున్నామని వివరించారు. వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తున్నదని, మహిళా సంక్షేమాన్ని ఓర్చుకోలేక బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని చెప్పారు. పదేండ్లు మహిళలను పట్టించుకోని పాపాత్ములు బీఆర్‌ఎస్ నాయకులు.. సొంత ఇంటి ఆడబిడ్డను ఏడిపించిన వాళ్లు రాష్ట్ర మహిళల బాగు కోరుకుంటారా అని ప్రశ్నించారు. మహిళలు కష్టపడి ఆదా చేసుకున్న నిధులు రూ.1800 కోట్లను గత పాలకులు కాజేశారంటూ మహిళలకు చెల్లించాల్సిన రూ.3000 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టారని ఆరోపించారు. మహిళలకు అడగడుగునా అన్యాయం చేసిన బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలో మహిళలు బుద్ధి చెప్పాలని కోరారు. మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, బీఆర్‌ఎస్ గెలిచినా ప్రజలకు ఉపయోగం లేదని, మీ ఓటును వృధా చేసుకోకండి అంటూ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


