– నిధుల కోతలతో గ్రామీణాభివృద్ధికి ఆటంకం
– కేంద్ర మంత్రి పెమ్మసానితో మంత్రి సీతక్క
దిల్లీ, ఆగస్టు 5: రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను పెంచాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దిల్లీిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్‌లతో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయి శాఖాపరమైన అంశాలపై చర్చించారు. గత ఏడాది కేంద్రం 12 కోట్ల పని దినాలు మంజూరు చేసినప్పటికీ ఈ సంవత్సరం కేవలం 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేయడం గ్రామీణాభివృద్ధికి అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధితోపాటు మౌలిక సదుపాయాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఉపాధిపై ఆంక్షలు లేకుండా నిధులను పెంచాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రాన్ని అందచేశారు. సీతక్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.



