– జోరు వానలోనూ ముంపు ప్రాంతాల పరిశీలన
– ప్రయాణంలోనూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్
– సహాయక చర్యలపై అధికారులకు కీలక సూచనలు
– మంత్రి చొరవను మెచ్చుకుంటున్న కామారెడ్డి ప్రజలు
కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాలు కురుస్తున్న వేళ వెరవకుండా ప్రజలతోపాటు నిలబడి వారి బాధలు పంచుకునేందుకు కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. వర్షాలు మొదలైనప్పటి నుండి జిల్లా పర్యవేక్షణకు చేరుకునే వరకు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, వరదల పరిస్థితిని నిశితంగా సమీక్షించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక సూచనలు చేశారు. అధికారులను అప్రమత్తంగా ఉండమని ఆదేశించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. జోరు వానలోనే వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి ప్రజలతో మమేకమయ్యారు. రోజంతా వర్షంలో తడుస్తూ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సీతక్క బాధితుల సమస్యలు విన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న సహాయంపై తగు సూచనలు చేశారు. గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో విస్తృత సమీక్ష నిర్వహించి వరద నియంత్రణ చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. బాధితులకు తక్షణ సాయాన్ని అందించడంలో అన్ని విభాగాలు సమన్వయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్యపడకూడదని, ప్రభుత్వం అండగా ఉంటుందనీ ధైర్యం నింపిన సీతక్కపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా బాధితులకు బాసటగా నిలిచి మనోధైర్యం కల్పించిన సీతక్క శభాష్ అని ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి పర్యటన ముగించుకున్న మంత్రి సీతక్క శుక్రవారం ములుగు జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత గ్రామాలను సందర్శించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





