– రామదాసు చేయించిన ఆభరణాల అలంకరణ
– సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
– భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తులు
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 26 : యావత్ భారత్ దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణం శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలవరకు మిథిలా స్టేడియం వద్ద ఉన్న కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణం వేలాది భక్తజనులకు కన్నులపండుగగా జరుగనుంది. అందుకోసం జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం మధ్యాహ్నం నాటికే భక్తులు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. భద్రాచలంలో పండగవాతావరణం నెలకొంది. స్వామివారి కల్యాణం ఎప్పుడెప్పుడా అని భక్తు లు ఎదురు చూస్తున్నారు. స్వస్థిశ్రీ చాంద్ర మాన పరాభవ నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి నవమి అభిజిత్ లగ్నమందు కల్యాణం జరుగుతుంది. శివధనస్సును విరిచిన శ్రీరామచంద్రమూర్తికి మిధిలానగరంలో జన కుని పుత్రిక అయిన సీతామహాలక్ష్మీకి ఆనాడు పెండ్లి జరిగితే భద్రాచలంలో ఉన్న చతుర్భు జాలు, శంఖుచక్రాలు ధరించిన శ్రీమహావిష్ణు వు అంశం గల వైకుంఠ రాముడు వరుడుగా సాక్షాత్తు శ్రీమహాలక్షి స్వరూపురాలు అయిన సీతమ్మ వధువుగా కల్యాణం జరగడం విశేషం. భార్యాభర్తల అనుబంధానికి, అనురాగానికి నిర్వచనం ఇచ్చిన ప్రేమమూర్తులు శ్రీసీతారాములు తెలుగువారి ఇలవేల్పు భద్రాద్రి రాముడు. అందుకే తెలుగు వాగ్గేయకారుడైన భక్తరామదాసు, త్యాగరాజులకు ఆయన ఆరాధ్యదైవం అయ్యాడు. ఆరాధనకు అనుగుణంగా కీర్తనలు గానం చేయడం, కీర్తనలకు అనుగుణంగా ఆరాధన చేయడం భద్రాచలం క్షేత్రంలోని ప్రత్యేకత. భద్రాద్రిలో శ్రీ సీతారామనవమి నాడు జరిగే కల్యాణాన్ని అనుసరించి తమ తమ గ్రామాలు, పట్టణాల్లో, ఇండ్లల్లో కల్యాణాలు జరుపుకోవడం భక్తుల ఆనవాయితీ. తొలుత భద్రాద్రి రామునికి దేవాలయంలో ఉత్సవమూర్తులకు కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా భక్తుల జై జై ధ్వానాల మధ్య పల్లకిలో శిల్పకళా శోభితమై అలరారే కల్యాణ మండపానికి పుణ్యాహవచనం సంకల్పం చేసి, శాంతికోసం విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. తర్వాత కల్యాణానికి వినియోగించే అన్ని వస్తువులను, సామాగ్రిని ప్రక్షాళన చేస్తారు. ఆ తర్వాత రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహిస్తారు. 24 అంగులాల పొడవుగల 12 దర్భలతో అల్లిన ఒక దర్బతాడును సీతమ్మవారి నడుంకు బిగిస్తారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ ఎడమచేతికి రక్షా సూత్రాలు కడతారు. స్వామి గృహసామాగ్రి శుద్ధికోసం సువర్ణయజ్ఞపవీతాన్ని ధరింపచేస్తారు. 8 మంది శ్రీ వైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యావరణం జరిపిస్తారు. అంటే జగన్నాధుడు, దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి సీతమ్మే తగిన వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వధూవరుల వంశాలకు చెందిన పెద్దల గోత్రాలను మూడుసార్లు పఠిస్తారు. స్వామి పాదప్రక్షాళన అనంతరం పరిళభరిత తీర్థంతో మంత్రయుక్తంతో పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు. ఉత్సవం లోకోత్సవం అయినప్ప్పుడు మహాసంకల్పాన్ని చెప్పాలని శాస్త్రం. జగత్ కల్యాణం రూపమైన ఈ కల్యాణం పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దంపడుతూ జాతీయ భావాలను మేల్కొలుపుతుంది. సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీమహాలక్క్ష్మీ స్వరూపమైన సీతను జగత్ కల్యాణార్థం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం జరుగుతుంది.
ఆ పెళ్ళి కళ చూడాల్సిందే
ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగులు అనే విధంగా పట్టణంలోని కల్యాణమండపం ఆవరణలో ఏర్పాటు చేసి చాందినీ వస్త్రాలతో వేసిన మందిళ్లతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది. కల్యాణ మండపంతో పాటు పట్టణంలోని చప్టాదిగువ, గోదావరి నది ఒడ్డు తదితర ప్రాంతాల్లో చలువ పందిర్లు కల్యాణ శోభను తెలియజేస్తున్నాయి.అంతేకాకుండా బ్రిడ్జీ సెంటర్ వరకు చాందినీ వస్త్రాలతో ప్రధాన రహదారులు అలంకరింపచేసారు.పెళ్ళికళ ఉట్టిపడేలా పట్టణంలో ఎక్కడ చూసినా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మండపం ఆవరణలో వెదురు చలువ పందిర్ల క్రింద అందంగా అమర్చిన రంగుల చాంధినీ వస్త్రాలు మరింత అందం తెచ్చాయి. ప్రఖ్యాత శిల్పకళాచార్యుడు గణపతి స్థపతి నిర్మించిన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కల్యాణ శోభతో భద్రాచలం పట్టణం నాటి మిధిలానగరంను గుర్తుకు తెస్తుంది. సీతారాముల వివాహం కోసం నాటి మిధిలానగరమే నేటి భద్రాద్రిలో మిధిలాస్టేడియంగా మారిందా అనే విధంగా పెళ్ళి ఏర్పాట్లును అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఆనాదిగా వస్తున్న ఆభరణాలైన రామదాసు చేయించిన మంగళసూత్రాలు, చింతాకుపతకం, పచ్చలపతకం, కలికితురాయి వంటి ఆభరణాలు ఈ కల్యాణ కార్యక్రమంలో ఉత్సవ మూర్తులకు అలంకరింపచేస్తారు. జగత్కల్యాణం కోసం పట్టణంలో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న ఈ కల్యాణ మహోత్సవాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు.ఈ ఏడాది కూడా శ్రీ సీతారాముల కళ్యాణంకు ముత్యాల తలంబ్రాలు,పట్టువస్త్రాలు ప్రభుత్వ ప్రతినిధులు తీసుకురానున్నారు.
సీతమ్మకు చేయిస్తి.. 
చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!! అని రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ పతకాన్ని శ్రీరామనవమి నాడు, అలాగే ప్రత్యేకమైన ఉత్సవాల్లో సీతమ్మ తల్లికి అలంకరిస్తారు. పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అని భక్తరామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరతుని పేరిట చేయించిన ఈ పతకాన్ని భరతాగ్రజుడైన రామయ్యతండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామునికి అలంకరిస్తారు.మంగళసూత్రం : మూడు మంగల్యాలు గల మంగళ సూత్రాన్ని రామదాసుగారు చేయించారు. ఒకటి దశరధ మహారాజుగారి తరుపున, రెండు జనక మహారాజు తరపున, మూడు శ్రీ భక్తరామదాసు గారే కన్యాదాతగా తమ తరపున అమ్మవారికి సమర్పించినది. ఈ మాంగల్యముతోనే శ్రీరామ నవమినాడు కల్యాణ మీ వుత్సవము జరుగుతుంది. శ్రీరామ మాడ : రామదాసుని చెరనుండి విడిపించడానికి రామలక్ష్మణులిద్దరూ గోల్కొండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజీ అనే సిపాయిల రూపాలతో వెళ్ళి, ఆలయం నిర్మించడానికై ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణాలకు బదులుగా 6 లక్షల బంగారు నాణాలు చెల్లించారు. ఆ నాణాలపై ఒక వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయస్వామి రూపు ఉంటాయి. ఆ నాణానికే రామ మాడ అని పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఆ రామమాడను శ్రీరామనవమి మరియు ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణస్వామికి అలంకరిస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





