– తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇందులో అనేక దందాలు తోడవ్వడంతో దీనిపై లోతైన విచారణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారంఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ డియా వెల్లడించారు. సృష్టి కేసును సీసీఎస్ సిట్‌కి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్ట్ చేశామని, 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన బిడ్డను చూపించారని చెప్పుకొచ్చారు. మరో కేసులో రూ.15 లక్షలు ఎక్కువగా ఇవ్వాలని సృష్టి యాజమాన్యం డిమాండ్ చేసిందని తెలిపారు. విశాఖపట్నంలో కూడా సరోగసీ పేరుతో మోసం చేశారని డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. బాధితులకు ఇచ్చిన బేబీ గర్ల్‌కి డీఎన్‌ఏ టెస్ట్ చేసి సరిపోల్చినప్పుడు ఈ వ్యవహారం బయట పడిందని వెల్లడించారు. ఈ కేసులో చాలామంది డాక్టర్ల ప్రమేయం ఉందని తెలిపారు. విశాఖపట్నంలోని డాక్టర్లు విద్యులత, రవి, డాక్టర్ ఉషను అరెస్ట్ చేశామన్నారు. సికింద్రాబాద్‌లో ఉన్న హాస్పిటల్‌ను కేవలం కన్సల్టెన్సీగా మాత్రమే వాడుకున్నారని గుర్తుచేశారు. ఇక్కడ పేరుతో శాంపిల్స్ తీసుకుంటున్నారని చెప్పారు. మిగతా సరోగసీ ప్రాసెస్ అంతా వైజాగ్‌లో చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు డీసీపీ రష్మీ పెరుమాళ్. వీరిలో చాలామంది మహిళలు ఉన్నారని, మహిళా నిందితుల్లో చాలామంది అండాలు అమ్ముకున్న వారు ఉన్నారని, సరోగసీ తల్లులుగా నటించిన వాళ్లు ఉన్నారని తెలిపారు. ఎవరైనా దంపతులు సరోగసీ కోసం అప్రోచ్ అవగానే.. వాళ్లకు కొన్నిరోజుల తర్వాత ఒక ఫేక్ అల్ట్రాస్కాన్ రిపోర్ట్ పంపుతారని చెప్పుకొచ్చారు. సరోగసీ పద్ధతిలో పుట్టబోయే పాప స్కానింగ్ రిపోర్ట్ అని చెబుతారని అన్నారు. అదే సమయంలో డాక్టర్ నమ్రత ఏజెంట్లు ఓ గర్భిణిని వెతికి పెడతారని, 9 నెలల తర్వాత వైజాగ్‌లో డెలివరీ చేసి ఆ శిశువును సరోగసీ ద్వారా పుట్టిన పాప అని చెప్పి దంపతులకు అప్పగిస్తారని డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు.




