– అడిగిందే అడిగి తిప్పితిప్పి అడిగారు
– ఏడున్నర గంటలు విచారించారు
– వారిని కూడా నేను ప్రశ్నలు అడిగా..
– లీకులు ఇస్తూ ప్రజలను భ్రమింపచేస్తున్నారు
– దయచేసి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయండి
– విచారణ అనంతరం విలేకరుల సమావేశంలో కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: తమ అసమర్థ పాలన, పరిపాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికిì కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణకు పోలీస్ శాఖ పిలిచిందని, ఆ విచారణకు పూర్తిగా సహకరించి ఏడు, ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విచారణ సందర్భంగా తాను కూడా అధికారులను కొన్ని ప్రశ్నలు అడిగానన్నారు. సిట్ విచారణకు వెళ్లి వచ్చిన అనంతరం బీఆరఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తా ఉన్నారు.. లీకుల మీద లీకులు ముఖ్యంగా తమ పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరని అధికారులను అడిగితే తమకు సంబంధం లేదు.. మీడియా ఏదో రాస్తే మాకేం సంబంధం అని వారు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రతిసారీ విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడం, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగిందంటూ లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్‌లైన్ కావడం, దానివల్ల ప్రజలు నిజమనుకుని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి..ఇది మంచిది కాదు అని చెప్పానన్నారు. కానీ పేపర్లు రాస్తా ఉన్నాయి.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో మరీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. కొంతమంది హీరోయిన్లను వీళ్లు ఏదో ట్యాప్ చేసి బెదిరించి అడ్డగోలు వ్యాఖ్యలు రాసినారు.. ఇది వాస్తవమా.. వాస్తవమైతే మా ముందు పెట్టండి.. ఎవరికి ఎవరు సమాచారం ఇచ్చారు అని అడిగినానన్నారు. అక్కడ ఉన్న అధికారి.. అది కరెక్ట్ కాదు, తాము ఆల్రెడీ మీడియాకు చెప్పాము కదా అన్నారు. మీరు ఇన్ని రోజులు లీకుల పేరుతో నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులను మీరు నిరోధించలేరా అని ప్రశ్నించానని కేటీఆర్ తెలిపారు. ముందుగా మీడియాకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా. దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అన్నది దయచేసి చెక్ చేసుకోండి అని నా ప్రార్థన అని అన్నారు. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా కూడా అనేక అడ్డగోలు లీకులిచ్చారు. ఈ రోజు కూడా ఫలానా ఆయనను తీసుకొచ్చారు.. ఇట్లా చేశారు.. ఉక్కిరిబిక్కిరి.. ఇన్ని ప్రశ్నలు. అన్ని ప్రశ్నలు అని లీకులు ఇస్తారని వ్యాఖ్యానించారు. దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన… రెండేళ్లు అయిపోయింది, ఈ కాలక్షేపం జరగాల్సింది జరిగింది. ప్రజలకు మీరు అందించాల్సిన వినోదం అందించినారు. ఇకనైనా దయచేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.. ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి.. మాకూ అభిమానులు ఉన్నారు.. మాకూ కార్యకర్తలు ఉన్నారు.. మా నియోజకవర్గాల్లో మాపై ఆశలు పెట్టుకున్న ప్రజలు ఉన్నారు.. వాళ్ళు బాధపడతారు.. ఇష్టమొచ్చినట్టుగా మీరు అల్లి వార్తలు రాయవద్దు అని కోరుతున్నానన్నారు. ‘మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా.. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదని దయచేసి చెప్పండి అని అడిగినా. వాళ్ళు ‘మాకేం సంబంధం, మాకు తెలవదు’ అని నీళ్లు నమలడం తప్ప కావడం లేదని చెప్పే పరిస్థితి లేదు. ఒక మంత్రి స్వయంగా ‘నా ఫోన్ ట్యాప్ అయి ఉంది.. నేను మీతో మాట్లాడలేను’ అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగినా. దానికి కూడా సమాధానం చెప్పరు. అది కాదు ఇది కాదు అని తప్పించుకునే ప్రయత్నం తప్ప అధికారులు సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక ధారావాహికలాగా ఏదైతే నడుపుతున్నారో, అదే పరంపరలో అడిగిన ప్రశ్నలే అడుగుతూ మళ్ళీమళ్ళీ అడుగుతూ.. ఒక 300 పేర్లు చదువుతూ ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా అని దానితోనే ఎనిమిది గంటలు టైంపాస్ చేయడం తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. తాము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్లన్నా వేయండి.. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తిస్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని వాళ్ళకి కూడా చెప్పినామన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత పెద్దది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వం ఏదైతే పూర్తిస్థాయిలో డైవర్షన్ గేమ్ ఆడుతున్నదో దానికి సంబంధించి కచ్చితంగా మేము ఎత్తిచూపే ప్రయత్నం చేస్తునే ఉన్నాం. ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికినారు.
ఆధారాలు ఇస్తానని చెప్తే ఉలుకు పలుకు లేదు
సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయితీలో దొంగలు దొరికినారు అని చెప్పి హరీష్ రావు ప్రెస్‌మీట్ పెట్టి ఆధారాలతో ఇస్తానని చెప్తే ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు. ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి ఓఎస్‌డీ మధ్య జరిగిన పంచాయితీ.. రూ.300 కోట్ల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టినారు అని చెప్పి కేసు నమోదైతే దాని మీద సిట్ ఎందుకు లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇవాళ భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైరవిహారం చేస్తుంటే దానిపైన సిట్ వేయండి.. అట్లాగే హిల్ట్ పాలసీ అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి రూ.5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దానిమీద సిట్ ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్‌లో ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్‌గా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక ఏఐసిసి (AI్పు్పు) సెక్రెటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్టర్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయం ధర్మం ఖాకీ బుక్కు అందరికీ ఒకటే తీరు ఉండాలి కదా? ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్తాం, బాధ్యతగల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం. ఇవాళ వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు. వాళ్ళ దగ్గర కేస్ కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పితిప్పి అడగడం తప్ప ఏమీ లేదు అని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వ అవినీతిని మా పార్టీ నాయకత్వం ఎండగడుతోంది
ఈ ప్రభుత్వ అసమర్థతను, వైఫల్యాలను, వారి అవినీతిని మా పార్టీ నాయకత్వం ప్రతిరోజూ ఎండగడుతోంది. ప్రజలకు ఇచ్చిన 420 హామీల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుకుందాం. నేడు రెవెన్యూ పడిపోతోంది, ప్రభుత్వం అవినీతి భారంతో కూరుకుపోతోంది. ఆరు గ్యారెంటీల అమలుపై, పరిపాలనలోని వైఫల్యాలపై దృష్టి పెట్టండి. ఇవన్నీ కల్పిత కథలు, ఎవరో ఒకరిని నా పక్కన కూర్చోబెట్టి విచారించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అక్కడ ఒక్క తారక రామారావు, పోలీసులు తప్ప మరెవరూ లేరని చెప్పారు. ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్నది నిజం అని తేలిపోయిందన్నారు. నన్ను సాక్షిగా పిలిచారా లేక మరేదైనా కారణంతోనా అన్నది నాకు తెలియదు కానీ, వాళ్ళు అడిగిందే అడుగుతున్నారు. మేము భయపడే వాళ్లమైతే సమయం అడుగుతుంటిమి, కోర్టుకు వెళ్తుంటిమి. నేను నిన్న సిరిసిల్లలో ఉన్నాను, 4:30కు రమ్మంటే రాత్రి బయల్దేరి వచ్చేశాను. హరీష్ రావు సిద్దిపేటలో ఉండి కూడా పిలవగానే వచ్చారు. మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము అని కేటీఆర్ అన్నారు.
—————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





