SIT: కొద్దిసేపట్లో సిట్‌ ముందుకు కేంద్ర మంత్రి సంజయ్‌

– ఆయన ఇవ్వబోయే వాంగ్మూలంపై ఉత్కంఠ
– ట్యాపింగ్‌పై పక్కా ఆధారాలు సమసర్పించనున్న బండి సంజయ్‌
– కేసీఆర్‌, కేటీఆర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కొద్దిసేపట్లో సిట్‌ ముందుకు రానున్నారు. ట్యాపింగ్‌పై కీలక ఆధారాలను సిట్‌కు ఆయన సమర్పించనున్నారని తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సిట్‌ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయే అవుతారు. ఆయన ఇవ్వబోయే వాంగ్మూలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్‌ ట్యాపింగ్‌ను జాతీయస్థాయి అంశంగా బీజేపీ పరిగణిస్తుండగా కేంద్ర నిఘా వర్గాల నుండి కీలక సమాచారాన్ని కేంద్ర మంత్రి సేకరించినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం ఆయన ఫోన్‌ను ట్యాప్‌ చేసినట్లు నిఘా వర్గాలు నిర్దారించాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌, కేటీఆర్‌ పాత్రపై కేంద్ర నిఘా వర్గాలు ఆధారాలు సేకరించి వాటిని కేంద్ర మంత్రికి అందించినట్లు తెలుస్తోంది. జడ్జిల ఫోన్లను సైతం ట్యాప్‌ చేయడాన్ని బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నది. భార్యాభర్తల బెడ్రూం మాటలను ట్యాప్‌ చేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తుండగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే హైకోర్టులో బీజేపీ లీగల్‌ సెల్‌ కేసు వేసింది కూడా. ఇప్పటికే పెద్దాయన(కేసీఆర్‌) చెబితేనే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని సిట్‌ ఎదుట రాధాకిషన్‌ రావు అంగీకరించిన విషయం తెలిసిందే. నాటి డీజీపీ ఆదేశాలతోనే ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు ప్రభాకర్‌ రావు కూడా వెల్లడిరచారు. దీంతో కేసీఆర్‌, కేటీఆర్‌ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.
బండి సంజయ్‌తోపాటు బీజేపీ కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గకన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌ కుమార్‌, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *