సంక్షోభంలో సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌

– మాన‌వీయ కోణంలో విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు చేయాలి
– అసెంబ్లీలో భ‌ట్టి, తుమ్మ‌ల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేత‌
– నేత‌న్న‌ల‌ క‌ష్టాల‌ను మంత్రుల‌కు వివ‌రించిన కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను  విద్యుత్ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేసి, నేతన్నలను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును బుధ‌వారం అసెంబ్లీలో కలిశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన వివరించారు.  2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ (ఎస్ ఎస్ ఐ) యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని కేటీఆర్ వివ‌రించారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్ప‌డుతున్నార‌న్నారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను అదుకోవాలని మంత్రుల‌ను కోరారు.    సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్ మరియు సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలి. పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలి. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ఆయ‌న కోరారు. సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదని, అది వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించినదని కేటీఆర్ గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేటీఆర్ తోపాటు ఏంఏల్సీ ఎల్ర.మణ కూడా ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *