చేనేత వైభ‌వానికి ప్ర‌తీక ‘సింగిడి కలెక్టివ్’

– మ‌న నేత‌న్న‌ల నైపుణ్యం అద్భుతం
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శంస‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26: తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా పర్యావరణ హితమైన వస్త్రధారణను ప్రోత్సహిస్తూ రూపొందించిన ‘సింగిడి కలెక్టివ్’ (ఇంద్రధనస్సు) నూతన ఫ్యాషన్ బ్రాండ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు శుక్ర‌వారం ఆవిష్కరించారు. తెలంగాణ నేల స్వభావానికి అద్దం పట్టేలా పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో మన సంప్రదాయ చేనేత నైపుణ్యంతో ఈ బ్రాండ్ రూపుదిద్దుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ ఎప్పుడూ కొత్తదనానికి వేదికగా నిలుస్తుందన్నారు. ఇక్కత్ నుండి గొల్లభామ చీరల వరకు మన నేతన్నల నైపుణ్యం అద్భుతమ‌ని ప్ర‌శంసించారు. ఈ వారసత్వాన్ని నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా మారుస్తూ పర్యావరణానికి హాని లేని రీతిలో ‘సింగిడి కలెక్టివ్’ ముందడుగు వేయడం హర్షణీయమ‌న్నారు. వ్యాపారమే కాక మన నేతన్నలకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతతో యువత ఇటువంటి స్టార్టప్‌లను స్థాపించడం గర్వకారణమ‌ని కొనియాడారు. సంప్రదాయం – ఆధునికత కలబోతగా ‘సింగిడి పేరుకు తగ్గట్టే రసాయనాలకు దూరంగా, కేవలం ఆకులు, వేర్లు, పూల నుండి సేకరించిన సహజ రంగులను మాత్రమే ఇందులో వినియోగించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ప్లాస్టిక్ రహిత, సేంద్రీయ పత్తితో  రూపొందించిన ఈ వస్త్రాలు పర్యావరణ స్పృహ కలిగిన నేటి తరాన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. సింగిడి కలెక్టివ్ ఫౌండర్ విశ్వ సారథి మాట్లాడుతూ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మన మూలాలను గౌరవించేలా వస్త్రధారణ ఉండాలన్నదే మా లక్ష్యం. అంతరించిపోతున్న సహజ రంగుల అద్దకం విధానాలపై లోతైన పరిశోధన చేసి ఈ వస్త్రాలను రూపొందించాం. చేనేత రంగానికి ఎప్పుడూ అండగా ఉండే కేటీఆర్ మా ప్రయత్నాన్ని గుర్తించి ఆశీర్వదించడం మాకు కొండంత బలాన్నిచ్చింది అని పేర్కొన్నారు. లింగ భేదం లేకుండా ఆధునిక డిజైన్లతో రూపొందిన ఈ వస్త్రాలు www.singidicollective.com ద్వారా అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దోసల అనిల్ రెడ్డి ఆయన అనుచరులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *