సింగరేణి అభ్యున్నతికి కృషి

– కాకా నుంచి నేటి వరకు ప్రత్యేక శ్రద్ధ

– మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి

పెద్దపల్లి ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి దివంగత నేత, తన తండ్రి కాకా వెంకటస్వామి కారమణని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. కాకా నుంచి తన తనయుడి వరకు సింగరేణి ఉన్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని శాంతి నగర్‌ ఏరియాలో ఉన్న దుర్గా మాత మండపంలో మంత్రి వివేక్‌ ‌ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌కి ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. 1995లో సింగరేణి నష్టాల్లోకి వెళితే ఆనాటి కేంద్ర మంత్రి, తన తండ్రి కాకా వెంకటస్వామి ప్రధానిని ఒప్పించి సింగరేణికి రూ.10 వేల కోట్లు సహకారం అందించారని గుర్తు చేశారు. ఇవాళ సింగరేణి లాభాల్లో ఉందంటే దానికి కారణం కాక వెంకటస్వామి అని అన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి నుంచి తన కుమారుడు, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ వరకు కృషి చేస్తున్నారని చెప్పారు. తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్న కాలంలో రామగుండం ఫెర్టిలైజర్‌ ‌కంపెనీ మూతపడితే.. దానిని తెరిపించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.6 వేల కోట్ల ఆర్ధిక సహాయం అందేలా చూశానని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *