పట్టపగ్గాల్లేని వెండి ధరలు

– రూ.1,84,727 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిక

న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: బంగారంతో నాకేంటి పోటీ అన్నట్లుగా వెండి ధరలు అదరగొడుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం లేదు. సరిగ్గా ఏడాది క్రితం వెండి ధర కిలో తొలిసారి రూ.లక్ష దాటితే అబ్బో అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే వెండి పసిడికి ఏమాత్రం తక్కువ కానంటోంది. పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతోంది. దేశీయంగా కిలో వెండి రూ.1.84 లక్షల వద్ద సరికొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసింది. అటు పసిడి సైతం రూ.1.30 లక్షల పైనే పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరగడానికితోడు రూపాయి విలువ పతనం కావడమూ ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. వెండి రూ.3,126 పెరిగి రూ.1,84,727 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరింది. బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ 90 మార్కు దాటింది. దీంతో దేశీయంగా వీటి ధరలు పెరిగాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు 4,204 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వెండి ఔన్సు 57.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.1.32 లక్షలు పలుకుతుండగా కిలో వెండి రూ.1.83 లక్షలుగా ఉంది. గతంలో దేవుళ్ల బొమ్మలు, పూజా సామగ్రి, సంపన్నుల ఇళ్లల్లో పళ్లాలు, గ్లాసులకు వెండిని వినియోగించేవారు. కొవిడ్‌ తర్వాత పారిశ్రామికంగా వెండి వినియోగం పెరిగింది. సౌర విద్యుత్‌, విద్యుత్‌ కార్లు, మొబైల్స్‌ తదితర రంగాల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు చిన్న మదుపరులు పెట్టుబడి కోసం వెండిని కొనడం ప్రారంభించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి వెండికీ ఉండడంతో మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *