– రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులన్నీ దక్కేందుకు పక్కా ప్రణాళిక
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సత్తుపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: సింగరేణి లోకల్‌గా కాదు గ్లోబల్‌గా ఎదగాలని, సింగరేణి జెండా ప్రపంచవ్యాప్తంగా ఎగిరేలా చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కేవలం బొగ్గు ఉత్పత్తికి పరిమితమైతే సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని, అందుకే రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ కు సంబంధించిన బ్లాకుల వేలంలో పాల్గొని ఆ బ్లాకులను సాధించాలనే ఆలోచనలో సింగరేణి యాజమాన్యం ఉందని తెలిపారు. సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసమే తాను గనుల సందర్శన, కార్యాలయాల సందర్శన, సమీక్ష వంటివి ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ధర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కోసం రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తుందన్నారు. మొన్నటివరకు ప్రభుత్వరంగ సంస్థల పరిధిలోని బొగ్గు తవ్వకాలు జరిగేవని, కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో కేంద్రం బొగ్గు గనులను వేలం వేస్తోందని వివరించారు. ఈ వేలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటున్నాయని, విదేశాల నుంచి బొగ్గు కూడా దిగుమతి చేసుకునే మార్పులు జరిగాయని, ఫలితంగా విపరీతంగా పోటీతత్వం ఏర్పడిరదని తెలిపారు. ఈ నేపథ్యంలో సింగరేణి పోటీకి నిలబడి బతకాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. నాణ్యతతో కూడిన బొగ్గును వెలికితీయాలి.. సరఫరా చేయాలి.. మార్కెట్ ధరలకనుగుణంగా బొగ్గును విక్రయించే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. అందుకే అన్ని మార్పులపైన ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేస్తూ పోటీలో నిలబడి ప్రథమ స్థానాన్ని సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నదని వివరించారు. విద్యుత్తు ఉత్పత్తికే పరిమితం కాకుండా గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలార్, హైడల్, బ్యాటరీ, పంపుడు స్టోరేజ్, హైడ్రోజన్ వంటి విభాగాల్లో విద్యుదుత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. లిథియం, గ్రాఫైట్, కాపర్ వాటన్నిటికీ పోటీపడి ఆ బ్లాకులను సైతం సాధించాలనే ఆలోచనలో సింగరేణి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నదని తెలిపారు. ఏయే దేశాల్లో, రాష్ట్రాల్లో సింగరేణి ప్రవేశించడానికి అవకాశం ఉంది, రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని గ్లోబల్ టెండర్లు పిలిచి నిపుణుల సలహాలు స్వీకరించామని తెలిపారు. కర్ణాటకలో గోల్డ్, కాపర్ గనుల తవ్వకాల్లో టెండర్లు దక్కించుకొని సింగరేణి భాగస్వామిగా మారిందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులు సింగరేణి దక్కించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని, ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని టెండర్లు దక్కించుకుంటామని ఆయన తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్‌లో పెద్ద ఎత్తున ధర్మల్ పవర్‌ను చేపట్టామని, 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తులో రాజస్థాన్ ప్రభుత్వం భాగస్వామి అయ్యే దశకు సింగరేణి ఎదిగిందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో సైతం ముందుకు వెళ్తుందని, ఇప్పటికే ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నదని చెప్పారు. 1500 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కోసం రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి జాయింట్ వెంచర్‌లో పాల్గొంటుందని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రానికి కాదు.. ఈరోజు దేశానికి సంబంధించి అతి ముఖ్యమైన రోజు అని, 136 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 137వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందన్నారు.
ఓపెన్ మైన్ పరిశీలన : రెండు గంటలపాటు మైన్ లోపల సమీక్ష
సత్తుపల్లిలోని జలగం వెంగళరావు ఓపెన్ మైన్‌ను డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట వ్యూ పాయింట్ నుంచి పరిశీలించిన ఆయన తదుపరి మైన్ లోపలికి వెళ్లారు. ఓపెన్ మైన్‌ను ఎలా ప్రారంభిస్తారు.. ఎన్ని పొరలు ఉన్నాయి.. మైన్‌లో బొగ్గు ఎలా తీస్తారు.. ఏ రకమైన బొగ్గు ప్రస్తుతం ఇక్కడ లభిస్తుంది.. తీసిన బొగ్గును బయటకు ఎలా పంపిస్తారు.. 24 గంటలపాటు మైన్ పనిచేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం వాహనాలు ఎన్ని వినియోగిస్తున్నారు, శాశ్వత సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనే విషయాలు తెలుసుకున్నారు. మైన్‌లో ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు మార్కెట్‌లో ఏ ధర పలుకుతోంది, బొగ్గు తీసి రవాణా నేపథ్యంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు వంటి విషయాలు తెలుసుకున్నారు. బయటికి వచ్చాకనేరుగా కోల్ డిస్పాచ్ సెంటర్‌కు వెళ్లి అక్కడినుంచి బొగ్గు ఎలా బయటకు వెళ్తుంది, ఏయే ప్రాంతాలకు వెళ్తుంది తదితర వివరాలను డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే కట్ట రాగమయి, సీఎండీ కృష్ణభాస్కర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్ తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





