నేర‌ర‌హిత స‌మాజం కోసం కృషిచేయాలి

– పోలీసు ఆఫీస‌ర్ల మెస్‌లో జిమ్ ప్రారంభం
– పోలీసుల‌కు వెన్నెముక‌గా మినిస్టీరియ‌ల్ సిబ్బంది
– 30-40శాతం మంది మ‌హిళా ఉద్యోగుల సేవ‌లు అభినంద‌నీయం
– నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 1 : రాష్ట్ర ప్రజలందరికీ, పోలీస్ విభాగంలోని సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025వ సంవత్సరంలో మాదకద్రవ్యాల రవాణాను కట్టడి చేయడంలో, సైబర్ క్రైమ్, ఇతర నేరాలను అరికట్టడంలో మనం విశేషమైన విజయం సాధించాం. అదే పట్టుదలతో 2026లోనూ మరింత పకడ్బందీ కార్యాచరణతో నేరరహిత సమాజం కోసం కృషి చేయాలి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ ముందుండాలి” అని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఆకాంక్షించారు. మాసబ్ ట్యాంక్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఉన్నతాధికారుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఈగల్ , డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆర్.బి.వి.ఆర్.ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష బిస్త్, టి.జి.సి.ఎస్.బి డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డిజిపి మహేష్ ఎం. భగవత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఫ్యూచర్ సిటీ సిపి  సుధీర్ బాబు, మల్కాజ్ గిరి సిపి  అవినాష్ మహంతి, సైబరాబాద్ సిపి  ఎం. రమేష్ సహా పలువురు ఐపిఎస్ అధికారులు నూతన సంవత్సర వేడుకల్లో పాలుపంచుకున్నారు. అడిషనల్ డిజిపిలు  సంజయ్ కుమార్ జైన్,  అనిల్ కుమార్, చారుసిన్హా తో పాటు ఐజిపీలు  చంద్రశేఖర్ రెడ్డి,  రమేష్ నాయుడు తదితర సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో ఏర్పాటు చేసిన నూతన జిమ్ కు డిజిపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సంద‌ర్భంగా మహిళా ఉద్యోగిని ఒకరు కవితను వినిపించడంతో డిజిపి ఆమె కవితకు పదివేల రూపాయల బహుమతి ప్రకటించారు. వెనువెంటనే మరొక ఉద్యోగి కవిత చదివేందుకు ముందుకు రావడం కార్యక్రమంలో నవ్వులు పూయించింది. అదేవిధంగా, యూనిఫామ్ ధరించిన పోలీసులను నాలుగో సింహంగా కొందరు వర్ణిస్తే వారికి వెన్నెముకగా మినిస్టీరియల్ సిబ్బంది సేవలందిస్తున్నారని డిజిపి కొనియాడారు. కానీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన , మహిళా ఉద్యోగిని మినిస్టీరియల్ సిబ్బందిని డిజిపి నాలుగో సింహం గా ప్రశంసించారని పేర్కొనడంతో మరోసారి కార్యక్రమంలో నవ్వుల జల్లు కురిసింది. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులను ఉద్దేశించి డిజిపి మాట్లాడుతూ, డిజిపి ఆఫీస్‌లో ఆరున్నర సంవత్సరాల పాటు పర్సనల్, రోడ్‌ సేఫ్టీ & రైల్వేస్ తదితర విభాగాల్లో విధులు నిర్వహించడం వల్ల మినిస్టీరియల్ సిబ్బంది పనితీరుపై పూర్తి అవగాహన ఉందన్నారు. తెలంగాణ పోలీస్‌కు దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టడంలో డిజిపి కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది పాత్ర మరువలేనిదన్నారు. వారి పనితీరు ను గుర్తుచేసుకుంటూ, పోలీస్ సిబ్బంది అంటే యూనిఫామ్ తో కూడుకున్న గ్లామర్ ఉంటుందని వారికి వెన్నెముకగా మినిస్టీరియల్ సిబ్బంది కృషి ఉందని అభిప్రాయపడ్డారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ప్రమోషన్లు, ఫైల్ పరిశీలన, కోర్టు కేసుల వ్యవహారాలు, పరిపాలనా విధానాలను ఎంతో నిగ్రహంతో, ఓపికతో నిర్వహిస్తున్న మినిస్టీరియల్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఉద్యోగులలో 30 నుంచి 40 శాతం మహిళా సిబ్బంది సేవలు అందించడం అభినందనీయమని, అలాగే గత కొంతకాలంగా యువత చేరికతో పని సామర్థ్యం, ఫలితాలు మరింత మెరుగైన సమాచారం తనకు ఉందని తెలియజేశారు.ఈ సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్ ,డిజిపి కార్యాలయ యూనిట్ క్యాలెండర్ ను, డైరీ ని డిజిపి ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో పోలీసు అధికార్ల‌తో పాటు  టీఎన్జీవోస్ యూనియన్ , డిజిపి ఆఫీస్ యూనిట్ అధ్యక్షులు ఆర్. ఉపేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. శివరంజని, ఉపాధ్యక్షులు యండి .హఫీజుద్దీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శివకుమార్ , పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *