సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– విద్యుత్‌ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి
– ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్‌ పొందడం అభినందనీయం
– ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రస్తుత కాలంలో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా సేవలందించేందుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా భవన్‌లో మంగళవారం జరిగిన ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. విద్యుత్‌ సరఫరాలో ఎక్కడైనా ట్రిప్‌ అయితే వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వచ్చే ఫీడర్‌ ఔటేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఖీూవీూ) అమలును నూటికి నూరు శాతం త్వరితగతిన చేయాలని ఆదేశించారు. దక్షిణ విద్యుత్‌ మండలి పరిధిలో 6,500 ఫీడర్లు ఉండగా 5,500 ఫీడర్ల పరిధిలో ఈ పద్ధతి అమలులోకి తీసుకొచ్చినట్టు అధికారులు వివరించగా మిగిలిన ఫీడర్ల పరిధిలోనూ త్వరితగతిన ఈ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. ఆపరేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, వినియోగదారులకు మెరుగైన సేవలు, కార్యాలయంలో ఫైళ్ల పరిష్కారం వేగవంతంగా జరగడం వంటి పలు అంశాల ప్రాతిపదికగా ఎస్పీడీసీఎల్‌ ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్‌ పొందడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మెరుగైన సేవల ద్వారా మరిన్ని అవార్డులు సాధించాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. విద్యుత్‌ సిబ్బంది కోసం రూపొందించిన ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. మీమీ విభాగాల్లో గత కాలంలో చేయలేకపోయిన పనులను ప్రణాళిక ప్రకారం ఎవరి పరిధిలో వారు పూర్తి చేయాలని డైరెక్టర్లకు సూచించారు. 108 అంబులెన్స్‌ తరహాలో విద్యుత్‌ శాఖలో 1912 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారని, ఈ అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సోలార్‌ పవర్‌కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, పూర్తిస్థాయిలో అమలుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ సీఎండి నవీన్‌ మిట్టల్‌, సిఎస్పీడీసీఎల్‌ సీఎండి ముషారఫ్‌ ఫారుఖితోపాటు డైరెక్టర్లు, సీఈలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *