ఆదివారం
కొన్ని దుకాణాలు
రోడ్డు మీదికి వచ్చి పదే పదే పిలుస్తుంటాయి
కూడబెట్టడానికి కాదు బతకడానికి
పొట్ట చేత బట్టుకొని
నెత్తిన ముళ్లే దించుకున్న వ్యాపారాలు
పుట్టిన రాష్ట్రంలో
పెరిగిన ప్రాంతంలో
రెక్కలిరుగ కష్టం చేద్దామంటే
పని దొరకని అనిశ్చిత సంక్షోభం
క్వారీలు ఇటుక బట్టీలు
కోళ్ల ఫారం వ్యవసాయ భవన నిర్మాణ
అసంఘటిత కార్మిక లోకానిది
మన భాష కాదు
మన మాట రాదు అయితే నేమి
హావభావాలు దేశమంతా ఒక్కటే !
ఎక్కడైనా
ఆకలి దాహం
కనీస అవసరాల పాటల పల్లవి ఒకటే
చరణాలే వేరువేరు
నాలుగు సార్లు తొడిగిన బట్టలు
చివరి ఉతుకు కోసం ముస్తాబై ఎదురుచూస్తుంటాయి
మమ్మల్ని గుర్తించేవారు
గుర్తుపట్టేవారు లేరుగా
అందుకే !
దైవసాక్షిగా చెబుతున్నాం
మీ పాత బట్టలు
పని మీదికి పనికి వచ్చే
మారు వేసుకునే గుడ్డలు అంతే !
ఆడ మగ తేడా రాకుండా
చిన్న పెద్ద భేదం లేకుండా
ఈ రోజు
ఎక్కువ శాతం మంది
తినడానికి త్రాగడానికి
విశ్రాంతి తీసుకోవడానికి ముందుంటారు
కొందరే బతకడానికి జీవిస్తుంటారు
– జిందం అశోక్
8978532225





