– వారికి ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైంది
– డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కాలయాపన
– తక్షణం ఆదుకోవాలంటూ సిఎంకు హరీష్ రావు లేఖ
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 20: సిగాచి బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం హా ఏమైందని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు గడిచినా సిగాచి బాధితులకు పరిహారం అందకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా అని నిలదీశారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా బాధితులకు రూ.40 నుండి 50 లక్షలు అందించాం అని ప్రకటించడం అత్యంత శోచనీయం అన్నారు. చికిత్స ఖర్చులను పరిహారంలో కోత విధించడం అమానవీయం. ఆచూకీ దొరకని 8 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. సిగాచి యాజమాన్యానికి అధికారులు ఏజెంట్లుగా మారారు. బాధితులను చీదరించుకోవడం దారుణం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన రూ. 2 లక్షలు ఇప్పించే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? హైకోర్టు మొట్టికాయలు వేసినా యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? తక్షణమే కోటి పరిహారం చెల్లించాలి.. లేదంటే బీఆర్‌ఎస్ పక్షాన ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. పరిహారం కోసం బాధితులు చెప్పులరిగేలా తిరుగుతున్నా పాలకుల మనసు కరగడం లేదు. సిట్ వేయరు.. అరెస్టులు చేయరు.. నిస్సిగ్గుగా యాజమాన్యాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి న్యాయం చేయాలని కోరారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులు నడి రోడ్డున పడి కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో మీరు, ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. ప్రమాదం జరిగిన జూన్ 30న మీరు స్వయంగా వచ్చి మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని ఘనంగా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు కానీ పరిహారాన్ని పరిహాసంగా మార్చారు. నాలుగు నెలలు గడిచినా పరిహారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. డెత్ సర్టిఫికెట్ లేక ఆ కుటుంబాలు బీమా డబ్బులు రాక, పరిహారం అందక నరకం అనుభవిస్తున్నాయి. నిబంధనల పేరు చెప్పి ఆచూకి దొరకని వారిని మృతులుగా పరిగణించడానికి 7 ఏళ్లు వేచి చూడమనడం మానవత్వం అనిపించుకుంటుందా అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





