– యాత్రను ప్రారంభించిన గవర్నర్ శుక్లా
– బందోబస్తు పర్యవేక్షించిన సిపి సజ్జన్నార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏళ్లతరబడి నగరంలో శ్రీరామ శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైందని, ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడిగా శ్రీరాముడిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఐకమత్యం, భక్తి భావనకు శోభాయాత్ర నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. శ్రీరామ నవమి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రాములోరి కల్యాణాలు, శోభాయాత్రలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నల్లకుంటలోని పాత రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడారు. నగరంలో దాదాపు 339 ప్రాంతాల్లో శ్రీరామ నవమి సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే శోభాయాత్రకు 3వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. అనుకున్న సమయానికి శోభాయాత్ర పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇతర పండుగలకు ప్రజలు సహకరించిన విధంగానే శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అందరూ సహకరించాలని సజ్జనార్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





