పీఎండీడీకేవైలో తెలంగాణ జిల్లాలను చేర్చండి

– క్రూడ్‌ పామాయిల్‌పై కస్టవమ్స్‌ డ్యూటీ తగ్గింపుతో సమస్యలు
– కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌తో రాష్ట్ర మంత్రి తుమ్మల

దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ప్రధాన మంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో తెలంగాణ జిల్లాలను చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. రూ.24,000 కోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్లపాటు కేంద్రం అమలు చేయబోతున్న ఈ పథకంలో 36 కేంద్ర పథకాల సమన్వయంతోపాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం అవుతూ ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం ద్వారా తక్కువ పనితీరు చూపుతున్న జిల్లాలకు విస్తృతంగా లాభం చేకూరుస్తుందని ప్రశంసించారు. ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటిపారుదల, నిల్వ, విలువ వృద్ధి వంటి అంశాల్లో ఇది ఒక చరిత్రాత్మక పథకమని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని నారాయణపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలను పీఎండీడీకేవై లక్ష్య జిల్లాల జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు. ఈ జిల్లాలు వర్షాధార పరిస్థితులపై అధికంగా ఆధారపడిన, తక్కువ ఉత్పాదకత కలిగిన, బలహీన రైతు వర్గాలను కలిగి ఉన్నందున వీటిని పై పథకంలో చేర్చడం వల్ల తెలంగాణ రైతుల సంక్షేమమేకాక దేశవ్యాప్తంగా ఆహార భద్రత, విలువ వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు తోడ్పడుతుందని వివరించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర పథకాలతో పూర్తి అనుసంధానం చేస్తూ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్‌ యూనివర్శిటీల భాగస్వామ్యంతో బలమైన జిల్లాస్థాయి ప్రణాళికలను సిద్ధం చేస్తుందని, డిజిటల్‌ మానిటరింగ్‌ ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌- ఆయిల్‌ పామ్‌ (ఎన్‌ఎంఈఓ-ఓపీ) అమలులో తెలంగాణ చేసిన కృషిని వివరించారు. ఇటీవల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ (సీపీవో)పై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 27.5% నుంచి 16.5%కి తగ్గించడం రైతులకు తీవ్ర సమస్యగా మారిందని, దీని వల్ల దేశీయ ధరలు క్షీణించి రైతులకు చెల్లించే ఫ్రెస్‌ ఫ్రూట్‌ బంచెస్‌(ఎఫ్‌ఎఫ్‌బీ) ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్‌ పామ్‌ గెలల టన్నుకు కనీస మద్ధతు ధర రూ.25 వేలు వచ్చేలా 2018లో ఉన్నట్లు 44% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించేలా చొరవ తీసుకోవాలని కోరారు.

వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలి

వ్యవసాయ, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్‌ పరికరాలపై విధిస్తున్న 12% జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని, రైతులకు ఆధునిక యంత్రాలు, నీటిపారుదల సాంకేతికత అందుబాటులో ఉంటే ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతమున్న జీఎస్టీ రేటు వల్ల ముఖ్యంగా చిన్న, సన్న రైతులు ఆధునిక పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నారని చెప్పారు. చిన్న రైతులు కూడా సాంకేతికతను ఉపయోగించుకునేందుకు వీలుగా, ఉత్పాదకతను పెంచి దేశ ఆహార భద్రత మరింత బలపడాలంటే మైక్రో ఇరిగేషన్‌ పరికరాలపై 12% జీఎస్టీని మినయించేలా చొరవ చూపాలని తుమ్మల కోరారు.

ఎరువుల సబ్సిడీ పెంపుపై విజ్ఞప్తి

ప్రస్తుతం న్యూట్రియంట్‌ బేస్డ్‌ సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) విధానం వల్ల యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఉన్నందున రైతులు దాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఫలితంగా భూమిలో నత్రజని అధికమై, ఫాస్పరస్‌, పొటాషియం, సల్ఫర్‌ వంటి పోషకాల వినియోగం తగ్గిపోతోందని తుమ్మల వివరించారు. దీనివల్ల నేలలో పోషక సమతుల్యత దెబ్బతింటోందని, దిగుబడులు కూడా దీర్ఘకాలంలో పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 4:2:1 నత్రజని, ఫాస్పరస్‌, పొటాషియం సిఫార్సు నిష్పత్తి పూర్తిగా చెడిపోయి 2018-19లో 6.6:2.6:1కి పడిపోయిందని, ఇది రైతులకు, దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమని గుర్తు చేశారు. ఫాస్పరస్‌, పొటాషియం, సల్ఫర్‌ వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమానంగా ధరలో సమతుల్యత తీసుకురావాలని సూచించారు. అన్నిటిపై ఏకరీతి సబ్సిడీ విధానం తీసుకొచ్చి సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రోత్సాహం కల్పించి, వ్యవసాయం భవిష్యత్తు, భూమి సారవంతత, దేశ ఆహార భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్‌ రావు, రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *