” ఇంగ్లండ్ రాజు జేమ్స్`1 ఎప్పుడూ మహిళల పట్ల తన అనుమానాస్పద దృక్కోణాన్ని ప్రదర్శించేవాడు. స్త్రీలు చపల చిత్తులని, నీతివర్తన లేనివారన్న అభిప్రాయంతో ఉండేవాడు. పురుషులను సమ్మోహితులను చేసి రెచ్చగొట్టే లక్షణాలు స్త్రీల సొంతమని వ్యాఖ్యానించేవాడు. మెడ కనిపించేవిధంగా వస్త్రధారణ, ముఖానికి మేకప్ వేసుకోవడాన్ని తీవ్రంగా నిరసించేవాడు. అప్పట్లో అతని ఆస్థానంలో ఈ రెండూ బాగా ప్రాచుర్యంలో ఉండేవి మరి! ఈరకమైన వేషధారణ శైలి, నైతిక విలువల క్షీణతకు గుర్తుగా మాత్రమేకాదు, ఒక అపరాధంగా పరిగణించేవాడు. కింగ్‌జార్జ్`5 కూడా ఆధునిక ఫ్యాషన్ దుస్తుల ధారణకు వ్యతిరేకం.. ”
ఒక పురుషుడు షార్ట్‌ను ధరించి బయట తిరుగుతుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తన పని తాను చేసుకుపోతున్నాడులే అనుకుంటారు. అదే ఒక స్త్రీ షార్ట్‌ను ధరించి బయటకు వస్తే ఒక్కసారిగా అందరిలో ఎక్కడలేని నైతిక విలువలు గుర్తుకు వస్తాయి. రెచ్చగొట్టే రీతిలో ఈ కురుచ దుస్తులు వేసుకోవడమేంటంటూ ముడివడిన నొసలుతో ఎక్కడలేని ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తారు. వస్త్రధారణ విషయంలో పురుషుడిని, స్త్రీని చూసే విధంలో మన సమాజంలో ప్రదర్శించే వివక్షను ఇక్కడ అర్థం చేసుకోవాలి. పురుషుడు ఎటువంటి డ్రస్ వేసుకున్నా పట్టించుకోని సమాజం, అదే స్త్రీ విషయానికి వచ్చేసరికి ఎక్కడలేని నైతిక విలువలు గుర్తుకువస్తాయి. అంటే వస్త్రధారణను నైతిక సూచికగా పరిగణిస్తుండటం స్త్రీద్వేషుల తిరోగమన దృక్కోణంగా పరిగణించాలి. ఎంతో ఆధునిక పురోగమన సామామాజిక నిర్మాణ వ్యవస్థలో ఉన్నామని చెప్పుకునే మనలోనే వస్త్రధారణ విషయంలో స్త్రీ పురుషుల మధ్య వివక్షా పూరిత వైఖరి కొనసాగడం విషాదం. ఇప్పుడే కాదు చరిత్రను పరిశీలిస్తే పురాతన కాలంలో రాజుల దగ్గరి నుంచి నేటి నాయకుల వరకు స్త్రీ వేషధారణను శాసించడమే కనిపిస్తుంది. తరచుగా సామాజిక కట్టుబాట్లు, మతపరమైన సంప్రదాయాలు లేదా వ్యక్తిగత కళాసౌందర్యారాధనకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు తప్ప, ఒక స్త్రీ తనకు నచ్చిన రీతిలో వస్త్రధారణ చేయడానికి ఆమోదం తెలిపే విశాల సంప్రదాయం ఎక్కడా కనిపించదు.
ఇంగ్లండ్ రాజు జేమ్స్`1 ఎప్పుడూ మహిళల పట్ల తన అనుమానాస్పద దృక్కోణాన్ని ప్రదర్శించేవాడు. స్త్రీలు చపల చిత్తులని, నీతివర్తన లేనివారన్న అభిప్రాయంతో ఉండేవాడు. పురుషులను సమ్మోహితులను చేసి రెచ్చగొట్టే లక్షణాలు స్త్రీల సొంతమని వ్యాఖ్యానించేవాడు. మెడ కనిపించేవిధంగా వస్త్రధారణ, ముఖానికి మేకప్ వేసుకోవడాన్ని తీవ్రంగా నిరసించేవాడు. అప్పట్లో అతని ఆస్థానంలో ఈ రెండూ బాగా ప్రాచుర్యంలో ఉండేవి మరి! ఈరకమైన వేషధారణ శైలి, నైతిక విలువల క్షీణతకు గుర్తుగా మాత్రమేకాదు, ఒక అపరాధంగా పరిగణించేవాడు. కింగ్‌జార్జ్`5 కూడా ఆధునిక ఫ్యాషన్ దుస్తుల ధారణకు వ్యతిరేకం. తన కుమార్తెను కూడా, ఆధునిక ఫ్యాషన్ల జోలికి పోకుండా సాధారణ శైలిలోనే దుస్తులను ధరించాలని నిర్దేశించేవాడు. అయితే ఆమె కూడా తన తండ్రి అభిప్రాయాలను తిరస్కరించకుండా ఆయన చెప్పినట్లుగానే నడుచుకునేది. నేడు కూడా ఈ పితృస్వామ్య మైండ్‌సెట్‌ను మహిళలు సహిస్తూనే వున్నారు.
సినీ నటుడు శివాజీ సినీ పరిశ్రమలో మహిళల వేషధారణపై చేసిన స్త్రీ వ్యతిరేక వ్యాఖ్యలు సరిగ్గా ఈ కోవకు చెందినవే. ఇటీవల ‘‘కోర్ట్’’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ చిత్రంలో ఆయన పాత్రపేరు ‘‘మంగపతి’’. బాలికల స్వేచ్ఛను వ్యతిరేకించే పాత్ర ఇది! దీన్నే మహిళలను నియంత్రించే వర్తమాన ‘‘మంగపతి’’ సిద్ధాంతం లేదా ఎటువంటి శిక్ష లేని సంస్కృతికి నిదర్శనంగా చెప్పాలి. సినీ పరిశ్రమలో మహిళల వస్త్రధారణ, ప్రవర్తనపై ఎవరూ అడక్కుండానే ఆయాచితంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను చెప్పిన విధంగా ఉన్న వస్త్రధారణ మాత్రమే అర్హమైనదన్నది ఆయన అభిప్రాయం. మహిళలు వేధింపులు ఎదుర్కొనడానికి ప్రధాన కారణం వారి వస్త్రధారణే, అందువల్ల సంప్రదాయ చీరెకట్టులో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉచిత సలహా కూడా ఇచ్చారు.
గ్లోబల్ పవర్ హౌజ్‌గా ఉన్న టాలీవుడ్లో సైతం స్త్రీత్వం చాలా అరుదుగా మాత్రమే సంక్లిష్టంగా ఉండేందుకు అనుమతించే సంస్కృతి కొనసాగుతున్నదన్న సత్యాన్ని ఇది వెల్లడిస్తోంది. ఆయన మాటలు రెండు కఠినమైన వైఖరులను వెల్లడిస్తున్నాయి. మొదటి ది ‘‘మంచి యువతి’’ రెండవది ‘‘చెడ్డ యువతి’’! ఇక్కడ మంచి యువతి అంటే, సంప్రదాయంగా ఉంటూ, తన పనేదో తాను చేసుకుపోతూ, కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో తన ప్రతిష్ట దెబ్బతినకుండా వ్యవహరించేది అని అర్థం. ఇక చెడ్డ యువతి అంటే దైర్యంగా మాట్లాడుతూ, ఆకర్షణీయంగా, ప్రమాదకరంగా, ఒక సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించేందుకు పనిచేసేదిగా ఉంటూ , వ్యక్తిగత జీవితంలో ఎటువంటి గౌరవం లేని మనిషి! టాలీవుడ్లో ఈ ద్విస్వభావ ప్రవృత్తి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నదే.
చీర కట్టుకొని దేవాలయంలో దేవుడి పాటను ఆలాపించే హీరోయిన్‌కు, కురచ, బిగుతైన దుస్తులు ధరించి పురుషులను రెచ్చగొట్టే రీతిలో ‘‘ఊ అంటావా’’ అనే ‘వాంప్’ లేదా ‘ఐటమ్’ సాంగ్ పాడే యువతి పూర్తి విరుద్ధం. వీరిద్దరిలో మొదటి యువతి వివాహానికి అర్హురాలన్న రీతిలో చూపిస్తే రెండో యువతి రహస్య కోర్కెలను తీర్చేదిగా లేదా ఇంత అని మాట్లాడుకొనే వ్యాపార వస్తువుగా చూపడం జరుగుతోంది. శివాజీ ప్రకటన మడొన్నా`వోర్ కాంప్లెక్స్ ను ప్రతిబింబిస్తోంది. ఇక్కడ స్త్రీలను రెండు కఠినమైన రెండు వర్గాలుగా వర్గీకరించడం జరుగుతోంది. ఒక రకం సదాచారులుగా మరొకరకం పాపాత్ములుగా! ఆ విధంగా స్త్రీలను అట్టడుగున నిలబెట్టి అవమానించడం బాగా అలవాటైంది. ఇక్కడ ఈయన సినిమా ప్రొమోషన్ కంటే, హిందూత్వ అజెండా (శివాజీ ఏపీలో ఒకప్పుడు బీజేపీ నేత)ను ప్రచారం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారనుకోవాలి. సినీ పరిశ్రమలో దీన్నొక తిరోగామి లక్షణంతో కూడిన జడత్వ భావనగా విమర్శకులు పరిగణిస్తారు. స్త్రీల పురోగతిని వృత్తిపరమైన అవసరం కంటే, మార్కెట్ జిమ్మిక్‌గా పరిగణించడం సినీ జగత్తులో ఎల్లప్పుడూ కొనసాగేదే! శివాజీ మాటలు కేవలం ‘‘కోర్ట్’’ సినిమాలో చూపిన విలన్ మంగపతి పాత్రను ప్రతిబింబిస్తోంది తప్ప మరోటి కాదు. ఇందులో చూపిన ‘‘స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’’ అనేది మహిళలను చూసే విధానంపై సినీపరిశ్రమను వెంటాడుతూనే ఉంటుంది.
తన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో, ఒక ‘‘అన్నగా’’ ఆ విధంగా మాట్లాడానని ఆయన మొదట్లో సమర్థించుకున్నా, తర్వాత క్షమాపణ చెప్పారు. అయితే ‘‘అన్నగా మాట్లాడాను’’ అన్న మాటలను ‘‘వాయిస్ ఆఫ్ ది ఉమెన్’’ పేరిట ఒక వేదికను ఏర్పాటు చేసుకున్న నటీమణులు తీవ్రంగా ఆక్షేపించారు. వాస్తవిక నైతిక విలువల విషయంలో ఆయన ‘‘అన్నగా’’ చెప్పిన మాటలు ఏవిధంగా పనికిరావని వారు స్పష్టం చేశారు. కేవలం ఇటువంటి ‘బోధనల’ ద్వారా టాలీవుడ్ వంటి ప్రదేశాల్లో పితృస్వామ్య నమ్మకాలను, మహిళలపై బలవంతంగా రుద్దడం తప్ప మరోటి కాదని వారు కుండబద్దలు కొట్టారు. ‘‘అన్నగా మాట్లాడుతున్నా’’ అని చెప్పడం కేవలం హిందూత్వ రాజకీయ తీర్పరితనం మాత్రమే. ఇక్కడ మహిళల శరీరాన్ని కేవలం శృంగార భావనతో చూడటం, వారి ప్రవర్తనను నియంత్రించాలన్న అసలు ఉద్దేశం ఈ మాటల వెనుక దాగివున్నదని వారు పేర్కొన్నారు.
మహిళల వస్త్రధారణను నైతిక విలువల వైఫల్యంగా పరిగణించడం, సమాజంలోని ప్రమాదకర ధోరణులకు అద్దం పట్టడమే కాదు, జీవతాంతం మహిళలను ఏవిధంగా చూస్తారనేదాన్ని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు. మహిళల హక్కులపై పోరాటంలో ముందుంటామని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ సహా, టాలీవుడ్ సూపర్ స్టార్లు ఎవరూ శివాజీ మాట్లాడుతున్న మోరల్ పోలీసింగ్‌ను విమర్శించకపోవడమే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ టాలీవుడ్ సూపర్స్టార్లు కేవలం సినిమాల్లో మాత్రమే స్త్రీల హక్కుల గురించి మాట్లాడతారు తప్ప, వాస్తవానికి వచ్చేసరికి తమ పితృస్వామ్య భావజాలాన్ని నిశ్శబ్దంగా ప్రదర్శిస్తారని ఆరోపించారు. వీరి మౌనం వెనుక స్త్రీల పట్ల అనుసరించే కఠినమైన ద్వంద్వ వైఖరికి మద్దతు స్పష్టమవుతోందని, ఇది కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదు, అన్ని రంగాల్లో కొనసాగుతున్న జాడ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సమాజంలో వేళ్లూనుకున్న పితృస్వామ్య భావజాలానికి గొప్ప నిదర్శనంగా పేర్కొన్నారు.
-శామ్ సుందర్