జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 10: రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ యువతను బలోపేతం చేస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తీరు స్ఫూర్తిదాయకమని యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులకు 25శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదన చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సామాన్య కార్యకర్త పార్టీలో ఉన్నత స్థాయికి చేరుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని తెలిపారు. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నట్టుగానే రాజకీయ రంగంలోనూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నదని తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి ఎన్నో కార్యక్రమాలను శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున గెలవాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి మహిళలు రావాలని పిలుపునిచ్చారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు రాహుల్ గాంధీ మహిళల కోసం శక్తి సూపర్ షి, ఇందిరా ఫెలోషిప్ వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లను ఆమోదించడం శుభ పరిణామమని, రాబోయే రోజుల్లో రాజకీయ పదవుల్లో మహిళల సంఖ్య పెరగడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.



