˜పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం (శివ కల్యాణం) సోమవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని శ్కెవాలయాల్లో శివ కల్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుండగా రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం ( హోలీ పండుగ) అనంతరం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న గుడిలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించగా వేలాది శివపార్వతులు, జోగినులు, వందలాది హిజ్రాలు పాల్గొన్నారు.
ఆలయంలో ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం దేవస్థానం చ్కెర్మన్ ఛాంబర్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై కల్యాణాన్ని నిర్వహించారు. కన్యాదాతలుగా సురేశ్ దంపతులు వ్యవహరించగా స్థానాచార్య ఉమేశ్ శర్మ వేదపండితులు శరత్ చంద్ర,రాజేశ్వర శర్మ తదితరుల అధ్యర్యంలో ఉదయం 10 గంటల నుంచి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం పూర్తిగా నిండిపోగా రోడ్డుపై వందలాది భక్తులు వేచి ఉండి ఎల్‌ఇడి తెరపై కల్యాణాన్ని చూశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలను దేవస్థానం ఈఓ వినోద్ రెడ్డి,వేములవాడ మున్సిపాలిటి తరపున మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌లు సమర్పించారు. ఈ కల్యాణం లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.





