– తెలుగులో ప్రమాణం చేసిన శుక్లా
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : లోక్ భవన్‌లో రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ శివప్రతాప్ శుక్లాతో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణకు సేవ గొప్ప అదృష్టంగా భావిస్తున్నా : గవర్నర్ 
ప్రియమైన తెలంగాణ సోదరసోదరీమణులారా.. తెలంగాణ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు వినమ్రతతో, గౌరవ భావంతో స్వీకరిస్తూ ఇది తనకు గొప్ప సత్కారంగా భావిస్తున్నానని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన భారత రాష్ట్రపతి, భారత ప్రధాన మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనమని, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తన అనుభవం ఈ రాష్ట్రానికి ఉపయోగ పడుతుందని భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహనశక్తికి చిహ్నంగా నిలుస్తుందంటూ ప్రజల అకుంఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి, సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి, కేబినెట్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మనమందరం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదామన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా తాను సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటాననన్నారు. తన విధులను న్యాయబద్ధంగా, నిజాయతీగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా అంకితభావంతో నిర్వహిస్తానని, మనమందరం సమష్టిగా సుసంపన్నమైన రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
గవర్నర్‌కు మంత్రుల శుభాకాంక్షలు
ప్రమాణస్వీకారం అనంతరం మంత్రులు భట్టి విక్రమార్క, దనసరి అనసూయ సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి మంత్రివర్గం గవర్నర్‌తో గ్రూప్ ఫొటో దిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





