– రూ.165 కోట్లతో రహదారుల నిర్మాణం
– 1418 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర ప్రారంభానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే మేడారానికి ప్రతీ రోజూ లక్షలాది మంది భక్తులు ముందస్తు మొక్కులకై తరలి వస్తున్నారు. కేవలం, జాతర జరిగే జనవరి 28 వతేదీ నుండి 31 తేదీ మధ్యలోనే దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున, మేడారానికి వచ్చే ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, రోడ్లు, భవనాల శాఖ నిర్వహణలో ఉండే రహదారులతో పాటు పంచాయితీ రాజ్ శాఖ ద్వారా నిర్వహించే రహదారులన్నింటిని పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వివిధ శాఖల క్రింద మేడారానికి దారితీసే 39 ప్రధాన రహదారులు ఉన్నాయి. ఇవే కాకుండా, మరో 10 రోడ్లను, మూడు కల్వర్టులను కొత్తగా నిర్మించారు. జాతీయ రహదారులకు చెందిన 8 రహదారుల పటిష్టత, మరమ్మతు, నూతన బ్రిడ్జిల నిర్మాణాన్ని రూ. 360 లక్షలతో చేపట్టి పూర్తి చేశారు. వీటిలో, ప్రధానంగా, కటాక్షపూర్, మల్లంపల్లి లవద్ద నూతన బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా దాదాపు రూ. 102 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం, పటిష్ట, ఇతర సివిల్ పనులు రికార్డు సమయంలో పూర్తిచేశారు. ఈ శాఖ క్రింద ఉన్న పస్రా నుండి భూపాల పల్లి వరకు 33 కిలోమీటర్లు, తాడ్వాయి నుండి నార్లాపూర్ వరకు 20 కిలోమీటర్లు, చిన్నబోయినపల్లి నుండి ఊరట్టం వరకు 23 కి.మీ. రహదారుల పటిష్టత, రీకార్పెటింగ్ చేపట్టారు. వీటితోపాటు, చిలకల గట్టు సమ్మక్క మార్గం నుండి గద్దెల వరకు, సమ్మక్క టెంపుల్ వద్ద, పోలీస్ క్యాంపు ల వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు చేశారు. పోలీస్ క్యాంపు వద్ద హెలీపాడ్స్ నిర్మాణం, మరమత్తులు చేపట్టారు.
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా రూ. 52 .21 కోట్ల వ్యయంతో 84 పనులు చేపట్టారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా రూ. 8.08 కోట్ల వ్యయంతో 3 కొత్త భవనాల నిర్మాణం, 29 ప్రస్తుత భవనాల మరమత్తులు, 5 కొత్త రోడ్ల నిర్మాణం తదితర పనులను చేపట్టి పూర్తి చేశారు. జాతరకు ఆర్టీసీ బస్సులతో పాటు భారీ సంఖ్యలో ప్రయివేటు వాహనాలలో భక్తులు వస్తారు. లక్షల సంఖ్యలో వచ్చే ఈ వాహనాల పార్కింగ్ కు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా. 43 ప్రాంతాల్లో 1418 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను కల్పించారు. వీటిలో, అటవీ శాఖకు చెందిన 15 ప్రాంతాలలో 235 ఎకరాల్లో, ట్రైబల్ వెల్ఫేర్, పట్టా భూములకు చెందిన 24 ప్రాంతాల్లో 1164 ఎకరాల్లో, ప్రభుత్వ భూములకు చెందిన 3 ప్రాంతాల్లో 19 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయంతో పాటు ఇక్కడ ఉండే భక్తులు, డ్రైవర్లకు తాగునీటి సౌకర్యం, టాయిలెట్ తదితర సౌకర్యాలను కల్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





