– దర్యాప్తులో గుర్తించిన ఈడీ అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గత ప్రభుత్వంలోని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీగా ఉన్న జి. కల్యాణ్ కుమార్, ఇతర లబ్ధిదారులు, మధ్యవర్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక ఆధారాలు సేకరించినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. వివిధ ప్రభుత్వ అధికారులకు ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 200కుపైగా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులు, 31 సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులను సీజ్ చేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక కూడా గొర్రెల పంపిణీలో కుంభకోణం జరిగినట్లు గుర్తించింది. మార్చి 2021తో ముగిసిన కాలానికి సంబంధించిన కాగ్ నిర్వహించిన ఆడిట్‌లో పథకం అమలులో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్ రికార్డులు అసంపూర్ణంగా ఉండటం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్‌కు చెల్లింపులు చేయడం వంటివి గుర్తించారు. లేని వ్యక్తుల పేరుతో కూడా గొర్రెల యూనిట్లను కేటాయించినట్లు తేలింది. మొత్తం తెలంగాణవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయని ఈడీ అంచనా వేసింది. ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత, ఇంకా ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తోంది.





