– కేంద్రానికి ఎంపి శశిథరూర్ సూచన
న్యూదిల్లీ,జూలై31: ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గదన్ని కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపి శశిథరూర్ అన్నారు. మన వాణిజ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని అన్నారు. భారత దిగుమతులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా జరిమానాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటన సరికాదన్నారు. గురువారం పార్లమెంటు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత వాణిజ్యానికి అమెరికా అతి పెద్ద మార్కెట్. మన ఎగుమతులే 87-90 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయి. రష్యా నుంచి దిగుమతులు చేస్తున్నందుకు సుంకాలు, జరిమానా విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య చర్చల్లో బేరసారాల కోసం ఇది హెచ్చరిక కావొచ్చు. టారీఫ్‌ల నేపథ్యంలో ఎగుమతులు తగ్గితే అది మనకు నష్టం కలుగుతుంది. ఇది మన జీడీపీపై కూడా ప్రభావం చూపించొచ్చు. అమెరికా డిమాండ్లు పూర్తిగా అర్థం లేనివిగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించే హక్కు భారత్‌కు ఉంది. వారిని సంతోషపెట్టడానికి మన జీవనోపాధిని పణంగా పెట్టలేం. మన అవసరాలను కూడా అగ్రరాజ్యం అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ టారిఫ్‌ల విషయంలో మన దేశ విధానంపై నమ్మకం ఉందని థరూర్ పేర్కొన్నారు. తర్వాత ఎం జరుగుతుందనేది కొనసాగుతున్న చర్చలపై ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికా ఒత్తిడికి లొంగి పోకుండా.. న్యూదిల్లీ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తుందనే కారణం చూపుతూ.. భారత దిగుమతులపై ట్రంప్ 25శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు విధించారు. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో న్యూదిల్లీ ఒకటని ఈ సందర్భంగా మళ్లీ ఆరోపించారు. ఈ క్రమంలోనే రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తమకు సంబంధం లేదని ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి ఆర్థికవ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.




