పోలీస్ స్టేషన్‌ సమీపంలో బాలికపై లైంగిక దాడి

– నిందితుడి అరెస్ట్
– స్టేషన్ ఎదుటే గుడుంబా అమ్మకాలు
– పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు
జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్ 17: జిల్లా లోని సారంగాపూర్ మండలంలో ఏడేళ్ల పసిబిడ్డపై జరిగిన లైంగిక దాడి సంఘటన స్థానిక ప్రజల హృదయాలను కలచివేసింది. ఈ దారుణం జరిగింది ఎక్కడో మారు మూల కాదు. జిల్లాలోని సారంగాపూర్ పోలీస్ స్టేషన్
కు కేవలం 150 మీటర్ల దూరంలో! కూత వేటు దూరంలో జరిగిన ఈ అమానుష ఘట న, జగిత్యాల జిల్లాలోని గ్రామ భద్రతపై, ము ఖ్యంగా పోలీసుల బాధ్య తాయుత ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. జగిత్యాల రూరల్ సీఐ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినా, గ్రామస్థుల ఆగ్రహం చల్లారడం లేదు. ఎందుకంటే, ఈ దారుణానికి కేవలం నిందితుడి పాశవిక చర్య మాత్రమే కారణం కాదు… పోలీసుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది అని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ భద్రతకు అత్యంత కీలకమైన అంశం గుడుంబా అమ్మకాలు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, దీని ప్రభావంతోనే జనం మత్తులో ప్రమాదకరంగా తిరుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే గుడుంబా అమ్మకాలు జరుగుతున్నా, పోలీసులు కదలకపోవడం ఏమిటి? ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక రహస్యం ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలమైందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. గుడుంబా వల్ల మత్తు పెరిగి, విచక్షణ కోల్పోయి నేరాలు జరుగుతున్నా… అధికారులు చోద్యం చూస్తున్నందువల్లే ఈ వైఫల్య సంఘటన చిన్నారి భద్రతను బలి తీసుకుంది. ప్రభుత్వం ప్రతి గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను అమలు చేసింది. గ్రామంలో చిన్న విభేదాల నుంచి పెద్ద సమస్యల వరకూ, ప్రమాదకర పరిస్థితులను గుర్తించి పై స్థాయి అధికారులకు సమాచారాన్ని చేరవేసే బాధ్యత గ్రామ పోలీస్ అధికారిదే. గ్రామానికి వీపీఓ ఉన్నాడు… మరి గుడుంబా విక్రయాలు, మత్తులో తిరిగే వ్యక్తులు, ప్రమాదకర పరిస్థితులు ఎందుకు అతని దృష్టికి రాలేదు? పోలీస్ స్టేషన్ దగ్గరే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే, విపిఓ వ్యవస్థ అసలు పనిచేస్తున్నట్లేనా? లేక కేవలం కాగితాల మీదే ఉందా? అని గ్రామస్థులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒక పసిబిడ్డ భద్రతకే ఇలా జరిగితే, సాధారణ ప్రజల భద్రతకు గ్యారంటీ ఏమిటి? పర్యవేక్షణ, నిఘా పూర్తిగా కుప్పకూలిందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరమా? జరిగిన దారుణం నిస్సందేహంగా నిందితుడి పాశవిక చర్యే. కానీ, ఇంతటి దారుణం జరగడానికి కారణమైన భద్రతా వైఫల్యంపై దృష్టి పెట్టడం అత్యవసరం. ఈ విషాదం పోలీసుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి, గ్రామ భద్రతా వ్యవస్థలోని లొసుగులకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసు స్టేషన్‌కు ఇంత దగ్గరలో, అందరి కళ్ల ముందే ప్రమాదకర వాతావరణం నెలకొన్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి వైఫల్యానికి నిదర్శనం. ఒక పసిబిడ్డ జీవితం చిగురుటాకులా వణికిపోయేలా చేసిన ఈ దురదృష్టం కేవలం ఒక వ్యక్తి చేసిన నేరం కాదు. ఇది యావత్ పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం పలికిన భయంకరమైన శాపం. ఇప్పుడైనా, ఉన్నతాధికారులు మేల్కొని, కేవలం నిందితుడిపై చర్యలతో సరిపెట్టకుండా, విపిఓ వ్యవస్థ పనితీరుపై, గుడుంబా అరికట్టడంలో పోలీసుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page