– రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విమానాశ్రయంతో దశ తిరిగేనా
(మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి)
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏడు దశాబ్దాల తర్వాత మహర్ధశ పట్టబోతున్నది. పూర్వ వరంగల్ అభివృద్ధికోసం ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా చేస్తున్న ఆందోళనకు త్వరలో ఫలితం లభించబోతున్నది. ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు విమనాశ్రయం రావడంతో దశ తిరుగనుందనుకుంటున్నారు. రాజకీయంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత స్థానం ఉమ్మడి వరంగల్‌దన్న పేరుంది. కాని, పారిశ్రామికంగా పెద్దగా ప్రగతిని సాధించలేకపోయింది. అందుకు స్థానిక నాయకుల్లో చిత్తశుద్ధి లోపించడం ఒకటికాగా, దశాబ్దం కిందివరకు ఉమ్మడి రాష్ట్రం ప్రాంతేతరుల ఏలుబడిలో ఉండటంతో హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ జిల్లాలపై వారు శ్రద్ద చూపకపోవడం మరోకారణం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతకూడా ఆశించిన ప్రగతిని వరంగల్ సాధించలేకపోయింది. పైగా ఒక జిల్లాను ఆరు జిల్లాలుగా ముక్కలుచేయడంతో వరంగ్‌లకు వున్న కొద్ది ప్రతిభకు కొడగట్టింది. కేవలం రాజకీయ నాయకుల ఎదుగుదలకు ఉపయోగపడిందేకాని, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చలేకపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిజాం కాలంలో ఏర్పరిచిన ఆజంజాహి మిల్లు మాత్రమే ఉండేది. ప్రత్యక్షంగా పరోక్షంగా కనీసం ఆరువేల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది. కాని, నడవదన్న ముద్రవేసి మూసేసి, దానికున్న 202 ఎకరాల స్థలాన్ని గజాల లెక్కన అమ్మేసుకున్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 
దశాబ్దాల తర్వాత ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావడం స్థానిక ప్రజలకు కొంతైనా ఉపశమనం కలిగిస్తుందన్న ఆశ మళ్ళీ చిగురిస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానిక ప్రజల దశాబ్ధాల కల. ఆ కల నెరవేరే సమయం రానేవచ్చింది. ఇప్పటికే దాదాపు 90 శాతం పనులు పూర్తికావచ్చాయి. తాజాగా ట్రయల్ రన్‌కూడా జరిగింది. కాకపోతే సాంకేతికంగా ప్రధాని నరేంద్రమోదీ కొద్ది రోజుల్లో శంఖుస్థాపన చేయనున్నారు. ఇక్కడ మెట్రో కోచ్‌లు, ఈవిఎంలు, వ్యాగన్, పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ యూనిట్స్ పనిచేయనున్నాయి. దీంతో ఇది మల్టిపుల్ రైల్వే తయారీ యూనిట్‌గా మారనుంది. అంతేకాకుంగా కాజీపేట జంక్షన్‌ను ప్రత్యేక రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా చాలాకాలంగా ఉంది. అదే జరిగితే వరంగల్ రూపురేఖలే మారనున్నాయి. దీనితోపాటు మహబూబాబాద్ జిల్లాలోని అనంతసాగర్ సమీపంలో భారీ మెగా మెయింటెనెన్స్ డిపో రూపుదిద్దుకోబోతున్నది. ఇక్కడ గూడ్స్ రైళ్ళతోపాటు ఆధునిక రైళ్ళకు చెందిన కోచ్‌ల మరమ్మతు, ఓవరాలింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ రెండు యూనిట్స్ రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా దశ తిరుగనుంది. ఈ రెండు యూనిట్స్‌లో దాదాపు 20 నుంచి 25 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నా యంటున్నారు. అయితే ఏడు దశాబ్దాలుగా ఎలాంటి ఉపాధి అవకాశాలకు నోచుకోలేకపోతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఇక్కడ ప్రవేశపెట్టే ఉద్యోగాల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు, నిరహార దీక్షలు, ఉద్యమాలు చేసిన నిరుద్యోగ యువత మరోసారి ఉద్యమిస్తున్నారు. ఈ డిమాండ్ సరైందేనన్న భావన జిల్లా ప్రజల్లో ఉంది.
మామునూరు విమానాశ్రయం పునరుద్దరణ
కాగా, మామునూరు విమానాశ్రయం పునరుద్దరణ విషయంలోకూడా ఉమ్మడి వరంగల్ ప్రజలు దశాబ్దాలుగా ఆందోళన బాట పట్టారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన బడా వ్యాపార సంస్థలు, ఐటి, ఇతర పరిశ్రమలు, వరంగల్‌లో తమ శాఖలను ఏర్పాటు చేయాలంటే వారికి విమానయాన సదుపాయంలేక పోవడమన్నది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, అటు ఖమ్మం, ఇటు నల్లగొండకు చెందిన అనేక మంది ఐటి నిరుద్యోగులు వరంగల్‌లో ఐటి కంపెనీలు వస్తే బాగుండని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. అందుకు విమానాశ్రయం లేకపోవడం ఒక లోటుగా మారింది. స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు ఏర్పాటుచేసిన మామునూరు విమానాశ్రయాన్ని దశాబ్దాలుగాఎవరూ పట్టించుకోలేదు. కాని, దానికి ఇప్పుడు మహర్ధశ పట్టే అవకాశాలు అతి సమీపంలో కనిపిస్తున్నాయి. ఈ విమానాశ్రయానికి ఉన్న స్థలంతో పాటు మరికొన్ని ఎకరాలు కావాలని ఇండియన్ ఏయిర్ లైన్స్ తెలిపిన ప్రకారం భూ యజమానులతో అనేక దఫాలుగా రాష్ట్రప్రభుత్వం చర్చించి చివరకు వారికి కావాల్సిన 223 ఎకరాల స్థలాన్ని అందజేసింది. దీంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికున్న అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయినట్లైంది. ఇక్కడ పునరుద్దరణ పనులకు ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే భూమి పూజ చేయబోతున్నారు. దీంతో వచ్చే సంవత్సరానికల్లా మామునూరు విమానాశ్రయం పౌరయానానికి సిద్దమవుతుందని భావిస్తున్నారు. దీనివల్ల వ్యాపార, పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిరుద్యోగ యువత ఆశిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





