త్వరలో సాదాబైనామాల పరిష్కారం

– కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది
– దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జీవో 76
– శాసనమండలిలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైంనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో సభ్యుడు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ బీఆరఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదని చెప్పారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించామని, అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడంవల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేరకు జీవో 76ను విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా దరఖాస్తును పెండింగ్‌లో ఉన్నాయని, వీటన్నింటికీ పరిష్కారం లభించబోతోందని తెలిపారు.

ఆధార్ మాదిరిగానే భూధార్

నక్షా లేని 413 గ్రామాలకుగాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించామని, ఇందులో ప్రతీ సర్వే నెంబర్ కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ప్రతీ జిల్ల్లాలో 70 గ్రామాల్లో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దశలవారీగా భూ సర్వే నిర్వహించి భూధార్‌ను ఇస్తామని, రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.

అవినీతికి పాల్పడిన ఎవరినీ ఉపేక్షించం

ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది మీ-సేవ నిర్వాహకులతో కలిసి రూ.3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. తప్పు చేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. శాసనమండలిలో సభ్యుడు తాతా మధుసూదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆనాడు ధరణి పోర్టల్‌ను నాలుగు గోడల మధ్య ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి తీసుకొచ్చారని, దీనివల్లే కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్‌లో 40, 41 మాడ్యుల్స్ ఉంటే భూ భారతి పోర్టల్‌లో 6కు కుదించామని, ధరణి పోర్టల్‌ను అర్ధరాత్రి ఒక్కరోజు మార్చేది కాదని, దశలవారీగా మార్పులు చేసుకుంటూ వస్తున్నామని, ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో భూ భారతి పోర్టల్‌ను తెస్తామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *