హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : రాష్ట్రవ్యాప్తంగా కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి కంది రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అవుతున్నా కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రభుత్వం ఇప్పటివరకు కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కందులకు మద్దతు ధరపై రూ.400 బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 7,550 రూపాయలు కందులకు మద్దతు ధర ఉన్న బహిరంగ మార్కెట్లో రూ.6500 కు మించి క్వింటాలుకు చెల్లించడం లేదని రైతుల ఆవేదన చెందుతున్నారని . ప్రభుత్వం స్పందించకపోతే కంది రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కందులకు మద్దతు ధరపై రూ.400 బోనస్ తో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.




