– ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..
– అనుమానంతో నిప్పంటించి చంపాడు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. అడ్డువెళ్లిన కూతురును కూడా మంటల్లోకి తోయగా ఆమె తృటిలో తప్పించుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన దంపతులు వెంకటేశ్, త్రివేణి నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వెంకటేశ్ తరచూ అనుమానిస్తుండే వాడు. ఈ విషయంపై భార్యను తీవ్రంగా వేధించేవాడు. వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా భర్త వేధింపులు తాళలేక భార్య త్రివేణి పుట్టింటికి వెళ్లింది. దీంతో అక్కడికి వెళ్లిన వెంకటేశ్.. తాను మారానని, ఇకపై బాగా చూసుకుంటానంటూ నమ్మించి త్రివేణిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అయితే తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆమెను అతి దారుణంగా చంపేశాడు. ఎప్పటిలాగే అనుమానంతో భార్యతో గొడవకు దిగి విచక్షణ మరిచి ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురినీ మంటల్లో తోసేసిన వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇద్దరినీ స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కూతురు స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. కేవలం 12 గంటల్లోనే వెంకటేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా చూసుకుంటానని నమ్మించి తమ కుమార్తెను ఇలా దారుణంగా చంపేశాడంటూ త్రివేణి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిని హత్య చేసి తండ్రి జైలుపాలు కావడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. తల్లి కోసం వారు విలపిస్తున్న తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.