పనుల పూర్తికి డెడ్ లైన్ పెట్టండి

– పనులు పూర్తి చేయని అధికారులకు నోటీసులు జారీ చేయండి
– కాళేశ్వరం అభివృద్ధి పనులపై  మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,మార్చి 13 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరం అభివృద్ధి పనుల ను పూర్తి చేయాల్సిన పనులకు డెడ్ లైన్ పెట్టాలని, అప్పటి వరకు పూర్తి చేయకపోతే అధికారులకు షో కాజ్ నోటీ సులు జారీ చేసి శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కాళేశ్వరం నుంచి పలుగుల వరకు 22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే 7 కిలోమీటర్ల డబుల్ బీటీ రోడ్డు పనులకు, అదేవిధంగా కాళేశ్వరంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం పనులకు, ఆది ముక్తేశ్వర దేవస్థానం నుండి సరస్వతి ఘాట్ వరకు రూ.2 కోట్ల 38 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు రూ,1 కోటి 55 లక్షలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం మరియు అన్నారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.అనంతరం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన సమావేశానికి ఎస్‌ఈ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాకేం పని లేదనుకుంటున్నారా? పుష్కరాల కంటే ముఖ్యమైన పనులు ఏమి ఉన్నాయి అని అధికారులను ప్రశ్నించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులను అధికారులు సమన్వయంతో మే మొదటి వారం వరకు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, రోడ్లు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బస్టాండ్ కు చెరువు స్థలం కేటాయించాలని సీసీఎల్ఏతో ఫోన్లో మాట్లాడి చెరువు మొత్తం ఎండిపోయింది, పంటలు కూడా సాగు చేయడం లేదు  కాబట్టి బస్టాండ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సూచించారు. బస్టాండ్ స్థలం గెజిట్ లేదు కదా ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారని అటవీ శాఖ అధికారులను అడిగి తెల్లుసుకున్నారు. బస్టాండ్ లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందిపడుతున్నారని, చెరువు సర్వే చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నిర్దేశించిన టైంలో అధికారులు కేటాయించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ధార్మిక సంస్థ సలహాదారుడు గోవింద హరి,  ఎస్పీ సంకీర్త్,  అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్తు, పీఆర్, ఇరిగేషన్,  మిషన్ భగీరథ  తదితర శాఖల అధికారులు  పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *