– నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ
– ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం
న్యూదిల్లీ, జనవరి 22: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నైని విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలు సహా ఇతర అంశాలపైనా సింగరేణి అధికారులతో కలిసి ఈ బృందం దర్యాప్తు చేయనుంది. ఈ బృందంలో బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, బొగ్గు శాఖ టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందానికి కేంద్రం మూడు రోజుల సమయం ఇచ్చింది . మూడు రోజుల్లో సింగరేణిలో పర్యటించి నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరిపి ఆ నివేదికను కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తీవ్రమైన ఆరోపణలు రావడంతో దీనిపై స్పందించిన తెలంగాణ డిప్యూటీ సీఎం, గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్క టెండర్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే నైని బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) కూడా ప్రకటించింది. అయితే ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బిడ్లు ప్రారంభం కావాల్సి ఉంది. పాలనాపరమైన కారణాలతో టెండర్లను రద్దు చేస్తున్నట్లు సింగరేణి అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బోర్డు నామమాత్రంగా ఉండేదని, వారి హయాంలోనే ఆ సంస్థ అప్పులు భారీగా పెరిగాయని కిషన్‌రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి విద్యుత్ వాడుకొని జెన్‌కో, ట్రాన్స్‌కో డబ్బులు ఇవ్వలేదు. టెండర్ల నుంచి కాంట్రాక్టుల వరకూ అన్నీ కేసీఆర్ కుటుంబమే చూసేది. ఆ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు కూడా దుర్వినియోగం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రైవేటు కంపెనీలకు పనులు కట్టబెట్టారు. సింగరేణి బోర్డు సమావేశం వివరాలు కూడా నా దృష్టికి రావు. సింగరేణిపై కేంద్రం అజమాయిషీ ఎప్పుడూ లేదు. నిధులు లేక జిల్లాలకు రూ.1500 కోట్ల డిస్ట్రి మినరల్ ఫండ్ ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఆ సంస్థ అప్పులు భారీగా పెరిగాయి. గత పదేళ్లలో రూ.32వేల కోట్లకుపైగా సింగరేణి అప్పులు పెరిగాయి. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం సుమారు రూ.47వేల కోట్లు చెల్లించాలి. నిబంధనలకు విరుద్ధంగా సీఎండీని మరో నాలుగేళ్లు అదనంగా కొనసాగించారు. ప్రస్తుతం సింగరేణిలో ఇన్‌ఛార్జి సీఎండీతో కాలం గడుపుతున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





