అధికారులను వరద ప్రాంతాలకు పంపాలి

  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచన
  • ఇప్పటికే అందుబాటులో ఏడు ఎన్‌డీఎఫ్‌ బృందాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నందున ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రజలకు అండగా నిలబడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి కావాల్సిన ఆహారం, అన్ని రకాల ఇతర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్‌ ప్రభుత్వ అధికారులను వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు తక్షణం పంపించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలకు సహాయం అందించడానికి కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో ఇప్పటికే ఏడు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు తెలగాణ ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పాల్గొంటున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక బృందం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు బృందాలు, నిర్మల్‌ జిల్లాలో ఒక బృందం, ములుగు జిల్లాలో ఒక బృందం, హైదరాబాద్‌లో ఓ బృందం, మహబూబాబాద్‌లో మరో బృందం అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కో బృందంలో 50 మంది సభ్యులుంటారని, ఇందులో స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు, టెక్నీషియన్స్‌, ఎలక్ట్రీషియన్స్‌, కెనైన్‌ యూనిట్స్‌, మెకానికల్‌, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఉంటారన్నారు. మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని నదులు, వాగుల అంచున ఉన్న గ్రామాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *