–ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యం
– అక్టోబర్ 2 నాటికి ఐదులక్షలమందికి స్వయం ఉపాధి లక్ష్యం
– రూ.8వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
– దేశంలోనే ఇది ప్రథమం
– ఉన్నతస్థాయి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చిందని అధికారులకు తెలిపారు.
జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ ల పంపిణీ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి లో ఓకే సారి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పన పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాజీవ్ యువ వికాసంలో వారికి అవకాశం కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్లకు రాజీవ్ వికాసం కింద అవకాశం కల్పించాలంటూ యువకులు చేసిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గగత పది సంవత్సరాల కాలంలో సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అందిన మొత్తాన్ని ప్రజా ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సరంలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు చేయూతనిస్తున్నదన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు, ఏ రాష్ట్రంలోను ఒక సంవత్సరంలో స్వయం ఉపాధి కోసం రూ. ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమం ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది అన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేయడం కోసం వారం క్రితమే ఎస్ ఎల్ బి సి సమావేశం నిర్వహించాం, ఆ తర్వాత సంక్షేమ శాఖ అధికారులు బ్యాంకర్లతో తరచూ మాట్లాడుతూ ఈ స్వయం ఉపాధి పథకాన్ని చివరి దశకు చేర్చారనని అభినందించారు.
వెంటనే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 2న సాక్ష్యం లెటర్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హై లెవెల్ కమిటీ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




