అబద్ధాల అంబాసిడర్‌గా కేటీఆర్‌

– మహేష్‌ జీతం ఆలస్యంలో ప్రభుత్వానికి సంబంధం లేదు
– మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ములుగులో మల్గీ పర్పస్‌ వర్కర్‌ మైదం మహేష్‌ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్‌ వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50వేల మందికిపైగా ఎంపీడబ్ల్యూ కార్మికులకు ఇప్పుడు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు అందుతున్నాయని తెలిపారు. ములుగులో మైదం మహేష్‌ జీతం ఆలస్యం కావడంలో ప్రభుత్వ తప్పిదం లేదు.. జీతం ప్రాసెస్‌ చేయ‌డంలో స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండు నెలల వేతనం ఆలస్యమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమందికి, ములుగులో వందలాదిమందికి జీతాలు సమయానికి అందాయి.. అయితే మహేష్‌ విషయంలో ఈ నిర్లక్ష్యం జరిగింది.. అది కూడా స్థానిక సిబ్బంది పొరపాటుతో.. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేసి బిల్‌ కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించామని ఆమె చెప్పారు. మహేష్‌ కుటుంబానికి పరిహారం అందించామని, సిబ్బంది కారణంగా జీతం ఆలస్యమైంది తప్ప బడ్జెట్‌ లేక కాదని మిగిలిన కార్మికులు, కార్మిక నాయకులు స్పష్టం చేశారన్నారు. ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటైన క్రమంలో పంచాయతీ పద్దు నుంచి మున్సిపల్‌ శాఖలోకి మార్చి జీతాల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మంచి నీళ్లు అనుకుని పొరపాటున పురుగు మందు తాగానని మహేష్‌ స్వయంగా చెప్పిన రికార్డులున్నాయని ఆమె తెలిపారు. అయినా దాన్ని రాజకీయంగా వాడుకోవడం, శవ రాజకీయాలు చేయడం కేటీఆర్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో సర్పంచ్‌లు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదు.. ముగ్గురు పిల్లలున్నారని ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంటే నా కోసం పిల్లల్ని కన్నావా అని అవమానప‌రిచాడు.. అలాంటి కేటీఆర్‌ ఇప్పుడు అధికారం పోగానే ప్రజల మీద కపట ప్రేమ ప్రదర్శించడం హాస్యాస్పదంగా ఉంద‘న్నారు. కేటీఆర్‌ అబద్దాలు మానుకుని నిజాల మీద బతకాలని హితవు పలికారు. మహేష్‌ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *