భారతదేశపు సీడ్‌ హబ్‌గా తెలంగాణ

– సీడ్‌ డిప్లొమసీతో రెండు దేశాల‌ మధ్య పెరగనున్న విశ్వాసం
– ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌-2025 భారత్‌-ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఈ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం వాణిజ్యంపైనే కాకుండా సీడ్‌ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయానికి భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేసేందుకు ఒక వారధిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భారతదేశపు సీడ్‌ హబ్‌గా మారిందని, దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాన్ని తెలంగాణ నుంచి సరఫరా చేయడమేకాక, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామంటూ రాష్ట్ర విత్తన ఉత్పత్తి సామర్థ్యాన్ని వివరించారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్‌, నిల్వ సదుపాయాలతోపాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్‌ గుర్తింపు లభించిందన్నారు. అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా(పంటలకు పెట్టుబడి మద్దతు) విధానాన్ని వివరించారు. రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ జమ చేయడం ద్వారా రైతు తనకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని, తద్వారా పారదర్శకత పెరిగి, రైతును శక్తివంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఆఫ్రికా దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని సూచించారు. భారత దేశం గ్రీన్‌ రివల్యూషన్‌ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించిందని, ఆ విజయానికి మూలం నాణ్యమైన విత్తనం అని, అదే లేకపోతే పంట లేదు.. రైతు ప్రగతీ సాధ్యం కాదు అని మంత్రి తెలిపారు. ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటలు పండుతున్నప్పటికీ అనేకమంది రైతులు ఇప్పటికీ తాము దాచుకున్న పంటలో కొంత ధాన్యాన్ని విత్తనంగా వాడుతున్నారని, ఇది ఉత్పాదకతను తగ్గించే అంశమని తెలిపారు. ఆఫ్రికా దేశాలకు సస్యశ్యామలమైన నేలలు, అనుకూల వాతావరణం ఉన్నందున సరైన సమయంలో సరైన విత్తనం అక్కడి రైతులకు అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఆఫ్రికా విత్తన మార్కెట్‌ విలువ దాదాపు యూఎస్‌డీ 3.99 బిలియన్‌గా ఉందని, భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు, పరిశోధకులు, విత్తన సంస్థలు కలిసి లాభపడవచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌, ఆఫ్రికన్‌ సీడ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌, ఇతర భాగస్వామ్య సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ దేశాల నుండి, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *