దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం

– సెక్యూరిటీని ఛేదించుకుని దూసుకొచ్చిన కారు
– కారు స్వాధీనం.. డ్రైవర్‌ అరెస్ట్

‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6: ‌దిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారంనాడు కీలకమైన భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. సెక్యూరిటీని ఛేదించుకుని ఓ కారు దూసుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ‌రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక వాహనం బలవంతంగా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన సంచలనం సృష్టించగా దిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గేట్‌ ‌నెంబర్‌ 2 ‌వద్దనున్న ఇనుప బ్యారియన్‌ను ఛేదించుకుంటూ ఒక వాహనం అసెంబ్లీ ఆవరణలోకి దూసుకొచ్చింది. వాహనం డ్రైవరు స్పీకర్‌ ‌విజేందర్‌ ‌గుప్తా కార్యాలయం వైపు దూసుకుపోయాడు. కార్యాలయం ముందు ప్లవర్‌ ‌బోకే ఉంచడంతోపాటు స్పీకర్‌ ‌కారుపై ఇంకు చల్లినట్టు గుర్తించారు. ఘటన అనంతరం వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. హైసెక్యూరిటీ జోన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రతా ఆందోళనలను మరింత పెంచినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన దిల్లీ పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఉంచిన పుష్పగుచ్ఛంలో ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్‌ను స్కానింగ్‌ ‌చేసి వాహనం డ్రైవరు ఈ ఘటనకు పాల్పడడానికి కారణంపై విచారణ జరుపుతున్నారు. ఇటీవల ముగిసిన దిల్లీ అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల సమయంలోనూ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజా ఘటనతో హైసెక్యూరిటీ జోన్‌లో భద్రతా ఉల్లంఘనలు మరింత అందోళనలను కలిగిస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *