– రూ.715 కోట్లతో ఆధునికీకరణ
– సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రోజుకు 2.7లక్షల మంది ప్రయాణికులు
– మెట్రోకు, బస్‌స్టేషన్‌కు నేరుగా చేరుకునే ఏర్పాటు
– 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు
– మహబూబాబాద్ వద్ద మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో
– చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీని రాష్ట్రం పూర్తి చేయాలి
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: నేటి అవసరాలకనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా పునర్నిర్మించుకోవడమే కాదు, అద్భుతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికులకు అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు ఉండేలా డిజైన్ చేశామన్నారు. ఇందుకోసం మొత్తం రూ.715 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. ప్రతి రోజు 1.97 లక్షల మంది, ప్రతి గంటకు 22 వేల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ కు వస్తున్నారు. వారికి ఇబ్బందులు లేకుండానే నిర్మాణం వేగవంతంగా వచ్చే ఏడాది దశల వారీగా ఈ నిర్మాణం అందుబాటులోకి రానుంది.. నాలుగు నెలల్లో సౌత్ బ్లాక్, డిసెంబర్ నాటికి రైల్వే స్టేషన్ పూర్తి కానుంది.. 3 వేల మంది ప్రయాణికులు కూర్చునేలా 3 ఎకరాల్లో వెయిటింగ్ హాల్, క్యాంటిన్ వంటి సదుపాయాలు నిర్మిస్తున్నారు.. శంషాబాద్ ఎయిర్ పోర్టు మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేపడుతున్నాం.. ఈ స్టేషన్‌కు నేరుగా మెట్రో అనుసంధానం చేపడుతున్నాం.. బస్ స్టేషన్ కు కూడా నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు సబ్ స్టేషన్లు, అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ సిస్టమ్ స్టేషన్ లో ఉంటాయి.. రోజుకు 5 లక్షల లీటర్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. ప్రతి రోజు 2.7 లక్షల మంది, గంటకు 32 వేల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా తీర్చి దిద్దుతున్నామన్నారు. 1.65 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటివరకు 50 శాతం పనులు పూర్తయ్యాయి. సౌత్ బేస్ మెంట్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయి. సౌత్ మెయిన్ బిల్డింగ్, నార్త్ మెయిన్ బిల్డింగ్, కవర్ ఓవర్ ప్లాట్ ఫాం, హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి తదితర పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేసేందుకు మద్దతు ఇస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్టేషన్ ను ప్రారంభించుకోవాలనేది నా ఆకాంక్ష. డిసెంబర్ 25 నాటికి మల్టి లెవల్ పార్కింగ్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
తెలంగాణకు రైల్వే బడ్జెట్ 21 రెట్లు పెరిగింది
రైల్వే బడ్జెట్ లో కేంద్ర తెలంగాణకు 2014-15లో రూ.258 కోట్లు, 2025-26 నాటికి రూ.5,337 కోట్లకు పెరిగాయి.. మోదీ హయాంలో దాదాపు 21 రెట్లు పెరిగింది.. 2014-15 నుంచి 2025-26 వరకు 11 సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన రైల్వే బడ్జెట్ కేటాయింపుల మొత్తం రూ. 30,832 కోట్లు.. 2004-14 మధ్య 10 సంవత్సరాలలో రాష్ట్రంలో 136 కి.మీ ల కొత్త లైన్ల నిర్మాణం జరిగితే 2014-25 మధ్య 11 సంవత్సరాల కాలంలో 346 కి.మీ.ల కొత్తలైన్ల నిర్మాణం జరిగింది. ఇందులో పెద్దపల్లి-నిజామాబాద్, జగ్గయ్యపేట-విష్ణుపురం, భద్రాచలం-సత్తుపల్లి, దేవరకద్ర-కృష్ణా, అక్కన్నపేట-మెదక్ వంటి కొత్త ప్రాజెక్టులను పూర్తి చేశాం. సిద్దిపేట-కొత్తపల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. 2004-14 మధ్య మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణలో ఒక్క డబ్లింగ్/ ట్రిప్లింగ్/ క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం కూడా జరగలేదు. 2014-25 మధ్య 11 ఏళ్లలో 487 కి.మీ.ల డబ్లింగ్/ ట్రిప్లింగ్/ క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్, రాఘవపురం-మందమర్రి ట్రిప్లింగ్, MMTS ఫేజ్- 2, కాజీపేట్ బైపాస్ ప్రాజెక్టులు ఉన్నాయి. కాజీపేట్-బల్లార్ష ట్రిప్లింగ్, కాజీపేట్-విజయవాడ ట్రిప్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2004-14 మధ్య తెలంగాణలో 759 కి.మీ.ల రైల్వేలైన్ల విద్యుద్దీకరణ జరగగా, 2014-25 మధ్య 1,959 కి.మీ. ల రైల్వేలైన్ల విద్యుద్దీకరణ జరిగింది. కొత్తగా నిర్మించిన రైల్వేలైన్లు, నిర్మాణంలో ఉన్న రైల్వేలైన్లను మినహాయిస్తే, తెలంగాణలో 100 శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరుగుతోంది.
వచ్చే సంక్రాంతికి కొమురవెల్లి స్టేషన్ ప్రారంభం
గత పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 293 రోడ్ అండర్ బ్రిడ్జిలు, 43 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 49 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. వచ్చే సంక్రాంతి పండగకు కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించి మల్లన్న భక్తులకు రైల్వేసేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.42,219 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. రూ.294 కోట్లతో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సికింద్రాబాద్ లో ప్రారంభించుకున్నామన్నారు. రూ.908.15 కోట్లతో మహబూబాబాద్ పరిసర ప్రాంతంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌లో 2 పిట్ లైన్లు, కాచిగూడలో 1 పిట్ లైన్ ఏర్పాటు చేసి వందేభారత్ మెయింటెనెన్స్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. రూ.439 కోట్లతో వందేభారత్ కోచ్ ల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక డిపో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.521.36 కోట్లతో కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను ప్రధానమంత్రి చేతుల మీదుగా ఏప్రిల్ నాటికి ప్రారంభించుకోనున్నామన్నారు. రూ.412.26 కోట్లతో ఘట్ కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పొడిగింపు పనులను రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా పూర్తి చేస్తామన్నారు. రానున్న మూడేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలన్న సంకల్పం పెట్టుకున్నాం. రూ.3,591 కోట్లతో 173 కి.మీ.ల పొడవున చేపట్టనున్న పాండురంగాపురం-భద్రాచలం-మల్కాన్‌గిరి కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా ఓ కొలిక్కి వచ్చిందని గుర్తుచేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు రోడ్డు విస్తరణ పనులు చేయాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవట్లేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేయాలని, చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తే రైల్వే శాఖ నుంచి కూడా కావాల్సిన మద్దతు కూడా అందుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





