బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విసుర్లు
కోదాడ, ప్రజాతంత్ర, జులై 15: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండేళ్లలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సూత్రంతో మోదీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమేకాక భారతదేశాన్ని గ్లోబల్ శక్తిగా నిలబెట్టిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. కోదాడలో మంగళవారం జరిగిన మేధావుల సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన పూర్తిగా అవినీతి, అక్రమాల పాలనగా నిలిచిందంటూ ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవినీతి కేసులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా విచారణ సరిగా జరగకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాన్ని సూచిస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కేవలం ఓట్ల కోసమేనని, ఏడాదిన్నర గడిచినా గ్యారంటీల అమలులో ఏమాత్రం శ్రద్ధ లేదని, ఒకవైపు హామీలను విస్మరిస్తూ మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతూ, ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేధావులు తమ విజ్ఞానం, సామర్థ్యంతో సమాజాన్ని చైతన్యపరిచే భాద్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మేధావుల చైతన్యం, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కీలకమని స్పష్టం చేశారు. తొలుత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి విగహ్రానికి రామచందర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు.



