– క్రిస్టియానిటిలో కుల వ్యవస్థ లేదు
– క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ, ఎస్టీ హక్కులు ఉండవు
– హిందువుల, సిక్కు, బౌద్ద మతస్థులకే కుల హక్కులు
– ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు
న్యూదిల్లీ, మార్చి 24: మతమార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మతం మారిన ఎస్సీలకు ఆ హోదా ఉండదని స్పష్టం చేసింది. క్రిస్టియన్‌లోకి మారిన వారికి ఎస్సీ కింద లభించే వెసలుబాటు ఉందడని తేల్చింది. మతం మారితన తరవాత అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టి.. మంగలశారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటూ రామిరెడ్డి, స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్‌గా పనిచేస్తుండటంతో క్రైస్తవుడవుతారని.. రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పుట్టుకతో హిందువు అయినా.. క్రైస్తవం స్వీకరించడంతో ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని.. తమపై పెట్టిన కేసుకు విచారణార్హత లేదని వాదించారు. రామిరెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే ఎస్సీ హక్కులు పొందే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. కైస్త్రవ మతంలోకి మారి పాస్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. పాస్టర్ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారని.. తిరిగి మారలేదని నిరూపణ అయిందని ధర్మాసనం పేర్కొంది.
సుప్రీం తీర్పు స్వాగతించతగ్గది : రామచందర్‌రావు
మతం మారిన వ్యక్తులు ఎస్సీ రిజర్వేషన్లు, ఇతర రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందలేరంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును బీజేపీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి గట్టి రక్షణ లభించిందన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్‌కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు హిందూ సమాజంలోని అణగారినవర్గాల సామాజిక అభివృద్ధి కోసమే ఉద్దేశించినవని, ఒకసారి మతం మారిన తర్వాత అదే సామాజిక హోదాతో హక్కులను క్లెయిమ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. కొంతకాలంగా కొందరు వ్యక్తులు మత మార్పిడులకు పాల్పడుతూనే మరోవైపు అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్ల వాటాను పొందుతున్నారని ఆరోపించారు. దీనివల్ల నిజమైన దళిత బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ తీర్పుతో అక్రమాలకు అడ్డుకట్ట పడి, నిజమైన అర్హులైన ఎస్సీలకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్ముతున్నానన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు మత మార్పిడుిలను ప్రోత్సహిసూ రిజర్వేషన్ల అంశంలో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అటువంటి శక్తులకు ఈ తీర్పు ఒక గట్టి చెంపపెట్టు అన్నారు. తెలంగాణలో కూడా మతం మారిన వారు ఎస్సీ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఫలాలను అక్రమంగా పొందుతున్న ఘటనలు అనేకం ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.
———————————————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





