తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మార్చి మాసం ఆరంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తీవ్ర వేడి కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపుతోంది. అమాంతం పెరిగిన విద్యుత్ డిమాండ్, ఎండల తీవ్రతను ఎదుర్కోవడంలో ప్రభుత్వం మరియు ప్రజల మధ్య సమన్వయం ఇప్పుడు అత్యవసరం.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం ములుగు జిల్లాలోని మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో కూడా తీవ్రమైన ఎండలు నమోదవుతున్నాయి.వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వరంగల్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశముంది.అలాగే హైదరాబాద్ నగరంలో 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ తీవ్ర ఎండల పరిస్థితులు ఇంకా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి . పట్టణ ప్రాంతాల్లో ‘హీట్ ఐలాండ్’ ప్రభావం వల్ల రాత్రి వేళల్లో కూడా వేడి తగ్గడం లేదు. దీనివల్ల గృహ వినియోగదారులు ఏసీలు, కూలర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మరోవైపు యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకోవడంతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అనివార్యమైంది. ఈ రెండు అంశాలు కలిసి విద్యుత్ గ్రిడ్‌పై అసాధారణ ఒత్తిడిని పెంచుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతోంది. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక విద్యుత్ డిమాండ్‌గా నిలిచింది.గతంలో 2025 మే 6న నమోదైన 4,352 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఈసారి మార్చి నెలలోనే అధిగమించబడడం విశేషం.
నివాస గృహాల్లో వేడి భరించలేక మధ్యతరగతి ఇళ్లలో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది. వ్యవసాయం ఉచిత విద్యుత్ పథకం కింద లక్షలాది పంపుసెట్లు నడుస్తున్నాయి. వేసవిలో ఉత్పత్తి తగ్గకుండా ఉండేందుకు పరిశ్రమలు నిరంతర సరఫరాను కోరుతున్నాయి. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయడంలో డిస్కంలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కి పేలిపోవడం, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తడం సాంకేతిక సవాళ్లుగా మారాయి. సౌర శక్తి వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం కూడా అవసరం. తెలంగాణ ఇప్పటికే సౌర శక్తి రంగంలో మంచి పురోగతి సాధించింది. అయితే గృహ స్థాయిలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విద్యుత్ డిమాండ్‌లో కొంత భాగాన్ని ప్రత్యామ్నాయ శక్తి ద్వారా తీర్చుకోవచ్చు.
ప్రభుత్వం కేవలం విద్యుత్ కొనుగోలుపైనే కాకుండా, విపత్తు నిర్వహణపై దృష్టి సారించాలి. ముందస్తు ఒప్పందాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి లేదా సెంట్రల్ గ్రిడ్ నుంచి అదనపు విద్యుత్‌ను సేకరించాలి.జిల్లాల వారీగా ‘హీట్ వేవ్’ హెచ్చరికలు జారీ చేయాలి. మధ్యాహ్నం వేళల్లో కూలీలు, కార్మికులు పనులకు వెళ్లకుండా పనివేళల్లో మార్పులు చేయాలి. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచాలి. ఎక్కడైనా మొరాయిస్తే తక్షణమే పునరుద్ధరించేలా మొబైల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి. అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి:అప్రకటిత కోతలు లేకుండా సాంకేతిక కారణాల వల్ల తప్ప, ఉద్దేశపూర్వక కోతలు లేకుండా జాగ్రత్త వహించాలి. వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఎండల వల్ల నీటి ఎద్దడి రాకుండా చూడటం అధికారుల ప్రధాన బాధ్యత. త్రాగు నీరు పంపింగ్ స్టేషన్లకు అంతరాయం లేని విద్యుత్ అందించాలి. అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ వడదెబ్బ తగిలిన వారికి చికిత్స అందించేందుకు హాస్పిటల్స్ ల్లో ప్రత్యేక వార్డులు, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజల సహకారం లేనిదే ఈ సంక్షోభాన్ని అధిగమించలేము.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు.తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ తప్పనిసరి. అనవసర వినియోగం నియంత్రణ ఉండాలి గదిలో లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపివేయాలి. ఏసీని 24-26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచడం వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా గ్రిడ్ పై ఒత్తిడి తగ్గుతుంది.గరిష్ట సమయాల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వాషింగ్ మెషీన్లు, గీజర్లు వంటి భారీ విద్యుత్ పరికరాల వాడకాన్ని తగ్గించాలి.
భానుడి భగభగలు ప్రకృతి పరమైన సవాలు అయితే, విద్యుత్ కొరత లేకుండా చూసుకోవడం మానవ ప్రయత్నం. విద్యుత్ సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్న తరుణంలో, వినియోగదారులుగా మనం విద్యుత్‌ను పొదుపుగా వాడుతూ వారికి అండగా నిలవాలి. అలాగే, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం, అధికారులు, ప్రజలు ఒక జట్టుగా పనిచేస్తేనే ఈ ఎండల కాలాన్ని సురక్షితంగా దాటగలం.





