– ఇది కాంగ్రెస్ మార్కు పాల‌న‌కు ఉదాహ‌ర‌ణ‌
– హ‌రీష్‌రావు ఎద్దేవా

సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసి పిల్లలు ఈరోజు రోడ్డు మీద కూర్చుని వియ్ వాంట్ జస్టిస్అ ని నినదిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా అని మాజీ మంత్రి హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు. విద్యా శాఖ నిర్వహణ మరెవ్వరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదేపదే చెప్పే రేవంత్ రెడ్డి ఈ సంఘటనను చూసి సిగ్గుపడాలి. వరుసగా విద్యాశాఖకు సంబంధించి జరగకూడని ఘోరాలు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు..  ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే తప్పుకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.100 కోట్లతో వీఐపీ గెస్ట్ హౌస్ పేరిట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రూ.4.5 కోట్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మూడో క్యాంప్ కార్యాలయం కట్టడానికి నిధులుంటాయి కానీ పిల్లలు చదువుకునే పాఠశాలకు అద్దె కట్టడానికి మాత్రం డబ్బులు లేవా అని ఆయ‌న నిల‌దీశారు.  5000 కోట్లతో మూసీలో ‘గాంధీ సరోవర్’ కడతామంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రికి బడి అద్దె కట్టేందుకు, నాణ్యమైన భోజనం పెట్టేందుకు చేతులు రావడం లేదా అని ప్ర‌శ్నించారు. వేల కోట్లు ఖర్చు చేసి పెట్టే విగ్రహాలకు సామాన్య ప్రజల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేయడం.. బడికి అద్దె కట్టక విద్యార్థులను రోడ్డున పడేయడం.. ఈ విధ్వంసక పాలన మీకే చెల్లుతుంది రేవంత్ రెడ్డి గారూ అని దెప్పి పొడిచారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.