పేద విద్యార్థులకు 100శాతం స్కాలర్‌షిప్‌లు

– ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు పెంచాలి
– కేంద్రాన్ని కోరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ప్రీ, ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను ఇప్పటి 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీద కుటుంబాల విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీల్లో ఎక్కువగా సీట్లు సాధిస్తున్నారని, అలాంటి ప్రతిభావంతులకు 100 శాతం స్కాలర్‌షిప్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికసిత్‌ భారత్‌-2047 దిశగా సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ రూపకల్పనలో భాగంగా గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రి డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌తో అన్ని రాష్ట్రాల సంక్షేమ మంత్రులు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కేంద్రానికి పలు ముఖ్యమైన సూచనలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ విద్యారంగం దేశంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, దీన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం సహకారం అందించాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎస్సీ హాస్టళ్లు పురాతన స్థితిలో ఉన్నందున కొత్తగా ఆధునిక హాస్టళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని కోరారు. వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులలివ్వాలని సూచించారు. ఎస్సీలలో చాలామందికి ఇల్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు అధికంగా ఉన్నందున పేదలకు గృహ నిర్మాణంలో కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ావృద్ధాప్య పింఛన్లలో కేంద్రం 68-79 ఏళ్ల వారికి నెలకు రూ.200, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 మాత్రమే ఇస్తోందని, మానవతా దృక్పథంతో ఈ సహాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. వికలాంగులకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.4,000 ఇస్తోందని, ఈ దిశగా కేంద్రం కూడా ముందడుగు వేయాలని సూచించారు. తెలంగాణకు సంబంధించి తమ విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వానికి త్వరలో ఒక నివేదిక సమర్పించనునట్టు మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, ఎస్‌సీడీడీ ముఖ్య కార్యదర్శి బుద్ధ ప్రకాష్‌, దివ్యాంగుల శాఖ డైరెక్టర్‌ శైలజ, సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సైదులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *